‘నా నేతృత్వంలో పదేండ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది..’ అని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. గ్లోబల్ సమ్మిట్‌కు ప్రధాని నరేంద్ర మోడీ, పార్టీ అగ్రనేతలు ఖర్గే, రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులను ఆహ్వానించడానికి ఢిల్లీకి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. గాంధీ భవన్‌లో జరిగిన డిసిసి అధ్యక్షుల సమావేశంలో తాను హిందూ దేవుళ్ళపై చేసిన వ్యాఖ్యలను బిజెపి నేతలు వక్రీకరించారని సీఎం మండిపడ్డారు. తన వ్యాఖ్యలకు ముందు వెనుక కట్ చేసి అసత్య ప్రచారం చేశారని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బిజేపికి డిపాజిట్ కూడా దక్కక పోవడంతో అసహనంతో ఉన్న ఆ పార్టీ నాయకులు తన వ్యాఖ్యలను వక్రీకరించి సోషల్ మీడియాలో ట్రోల్ చేశారని సీఎం విమర్శించారు. హిందూ దేవుళ్ళపై తాను ఎటువంటి వివాదస్పద వ్యాఖ్యలు చేయలేదని ఖండించారు.
హిందూ దేవుళ్ళు, హిందూ సమాజం వంటిదే కాంగ్రెస్ పార్టీ అని తాను చెప్పానని సీఎం వివరించారు. హిందూ దేవుళ్ళు మూడు కోట్ల మంది ఉన్నారని, అందులో పలు సారూప్యతలు కలిగిన దేవుళ్ళు ఉన్నట్టే, పార్టీలోనూ పలురకాల వ్యక్తులు ఉంటారని డిసిసి అధ్యక్షులనుద్ధేశించి చెప్పానని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. పార్టీలో అందరినీ కలుపుకుని పోవాలని, పార్టీ నేతగా ఎలా నడుచుకోవాలో చెప్పే ప్రయత్నంలో వివరించే క్రమంలో దేవుళ్ల గురించి ప్రస్తావించానే తప్ప కించపరుచలేదని సీఎం స్పష్టం చేసారు. పార్టీ అంతర్గత సమావేశంలో తాను చేసిన వ్యాఖ్యలకు ముందు-వెనుక ఎడిట్ చేసి దుష్ప్రచారం చేశారని విమర్శించారు. ఉత్తర భారత దేశంలోనూ తన పాపులారిటీని పెంచినందుకు బిజెపి నేతలకు థ్యాంక్స్ చెబుతున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎ ద్దేవా చేసారు.