హైదరాబాద్: భూభారతిలో నియమ నిబంధనలు కఠినతరం చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. భయంకరమైన ధరణిని బంగాళఖాతంలో వేస్తామని గతంలో చెప్పామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి చిన్న విషయానికి కోర్టుకు వెళ్లకుండా భూభారతి తయారు చేశామని, 9 లక్షల ఫిర్యాదుల్లో న్యాయపరమైనవి పరిష్కరించామని తెలియజేశారు. తమ ప్రభుత్వం వచ్చాక.. ధరణిలో ఉన్న అనేక సిక్రెట్ లాకర్లను ఓపెన్ చేశామని, కొన్ని దశాబ్దాల నుంచి ఉన్న సమస్యలను భూభారతి ద్వారా పరిష్కరించామని అన్నారు. భూభారతిలో చెప్పిన విధంగా భూధార్ కార్డులు సిద్ధం చేశామని, స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత భూధార్ కార్డులు పంపిణీ చేస్తామని శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. ఐదు రెవెన్యూ గ్రామాలను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకున్నామని, అభద్రతతో ఉన్న రైతులకు భూభారతి ద్వారా భద్రత కల్పిస్తున్నామని చెప్పారు. మొదటి విడతలో 3,490 మందిని సర్వేయర్లుగా నియమించామని, రెండో విడతలో 2,500 మందిని సర్వేయర్లను నియమించనున్నామని అన్నారు. మొదటి విడతలో సర్వేల కోసం 400 రోవర్లను కొన్నామని, ఆలస్యమైనా భూభారతి వ్యవస్థను మరింత పటిష్టంగా రూపొందిస్తామని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.