అమరావతి: ఎపి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను బర్తరఫ్ చేయాలని సిపిఐ నేత నారాయణ డిమాండ్ చేశారు. కోనసీమలోని కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి కారణం తెలంగాణ ప్రజల దిష్టి అని పవన్ చేసిన వ్యాఖ్యలపై నారాయణ స్పందించారు. గతంలో పవన్ చేగువేరా వేషం ధరించి విప్లవకారుడిని అన్నారని, ఇప్పుడు సనాతన ధర్మంలో ఉన్నాడు కాబట్టి దిష్టి అనే పదాలు వాడుతున్నారని దుయ్యబట్టారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య విబేధాలు రేకిత్తించే విధంగా ఉన్నాయని ధ్వజమెత్తారు. వెంటనే ఆయనను వెంటనే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. టిడిపి ఎంఎల్ఎ నందమూరి బాలకృష్ణ నటించి అఖండ2 సినిమా టికెట్ రేట్లు పెంచారని విమర్శలు గుప్పించారు. ఇలా రేట్లు పెంచడంతోనే ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు పుట్టుకొస్తున్నారని నారాయణ తెలియజేశారు. ఐబొమ్మ రవి లాంటి వాళ్ళను అరెస్ట్ చేసే నైతిక హక్కు ఈ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. సినిమా టికెట్ రేట్లు పెంచి ప్రజలపై భారం వేస్తున్నారని, సంపన్న వర్గాలకు ఊడిగం చేస్తూ, సామాన్య ప్రజలను దోచుకుంటున్నారన్నారు.
అఖండ2 సినిమాకు టికెట్ రేట్స్ పెంచుకునేందుకు ఎపి ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. డిసెంబర్ 4న రాత్రి 10 గంటల షోకు అనుమతి ఇవ్వడంతో పాటు టికెట్ ధరను రూ.600గా నిర్ణయించారు. విడుదలైన మొదటి రోజు నుండి 10 రోజుల పాటు స్క్రీన్ ధియేటర్లలో రూ.75, మల్టీప్లెక్స్‌లో రూ.100 పెంచుకునేందుకు అనుమతిస్తూ చంద్రబాబు ప్రభుత్వం జివొ జారీ చేసిన విషయం విధితమే.