హీరోయిన్ సమంత తన ప్రియుడు, డైరెక్టర్ రాజ్ నిడిమోరును పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించింది. పెళ్లి అనంతరం సమంతకు అత్తింటివారు గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు. ఈ సందర్భంగా సమంతను తమ కుటుంబంలోకి స్వాగతిస్తూ.. రాజ్ నిడిమోరు సోదరి శీతల్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. “చంద్రకుండ్‌లో శివుడిని ప్రార్థిస్తున్నప్పుడు… గొప్ప భక్తుడు ఆర్తితో నిండిన హృదయంతో శివలింగాన్ని ఆలింగనం చేసుకున్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటాడో.. ఈరోజు నేను అలా ఉన్నాను. ఆనందబాష్పాలతో నా హృదయం నిండిపోయింది. నేడు మా కుటుంబం పరిపూర్ణమైంది. రాజ్, సమంత.. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఒక కుటుంబంగా ఎలా ముందుకు నడుస్తున్నారో చూసి మేము చాలా గర్వపడుతున్నాము. వారికి మేము ఎప్పుడూ అండగా ఉంటాం” అని కొత్త జంటతో కలిసి దిగిన తమ ఫ్యామిలీ ఫోటోను ఆమె పోస్ట్ చేశారు.
కాగా, డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్‌లో డైరెక్టర్ రాజ్ నిడిమోరు, హీరోయిన్ సమంత పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికి పలువురు సెలబ్రిటీలు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ద్వారా పరిచయమైన సమంత, రాజ్.. తర్వాత ప్రేమికులుగా మారారు. ఇద్దరికీ ఇది రెండో వివాహం. రాజ్ నిడిమోరుకు వివాహం కాగా.. ఆమెకు దూరంగా ఉంటున్నారు. ఇక, సమంత, నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తర్వాత వారిద్దరూ విడాకులు తీసుకున్నారు.