రాయ్‌పూర్: సౌతాఫ్రికాతో బుధవారం జరిగే రెండో వన్డే మ్యాచ్‌కు ఆతిథ్య టీమిండియా సమరోత్సాహంతో సిద్ధమైంది. రాయ్‌పూర్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. రాంచిలో జరిగిన మొదటి వన్డేలో అద్భుత విజయం సాధించిన భారత్ ఈసారి కూడా గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. సీనియర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్‌లు తొలి వన్డేలో అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నారు. కోహ్లి ఏకంగా సెంచరీ సాధించగా రోహిత్, రాహుల్‌లు అర్ధ శతకాలతో అలరించారు. ఈ మ్యాచ్‌లో కూడా రోహిత్, కోహ్లిలపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఈసారి కూడా వీరు జట్టును ముందుండి నడిపించేందుకు సిద్ధమయ్యారు.
కోహ్లి, రోహిత్‌లు ఫామ్‌లో ఉండడం భారత్‌కు కలిసి వచ్చే అంశంగా మారింది. ఇద్దరు మరోసారి చెలరేగితే రెండో వన్డేలోనూ భారత్‌కు భారీ స్కోరు ఖాయం. రాంచిలో విఫలమైన యశసవి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్‌లు ఈసారైనా తమ బ్యాట్‌లకు పని చెప్పాల్సి ఉంది. కాగా, ఈ మ్యాచ్‌లో రిషబ్ పంత్‌ను బరిలోకి దించే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. తొలి వన్డేలో విఫలమైన రుతురాజ్ స్థానంలో పంత్‌ను ఆడించే అవకాశం ఉంది. ఇక వాషింగ్టన్ సుందర్ స్థానంలో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డిని ఆడించినా ఆశ్చర్యం లేదు.
అయితే తొలి వన్డేలో బౌలర్లు విఫలం కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ మ్యాచ్‌లో బౌలర్లు మెరుగైన ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది. లేకుంటే విజయం అంత సులువు కాదనే చెప్పాలి. మరోవైపు సౌతాఫ్రికాకు ఈ మ్యాచ్ చావోరేవోగా మారింది. సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి స్థితిలో జట్టుపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. దీన్ని తట్టుకుని ముందుకు సాగడం అనుకున్నంత తేలికకాదని చెప్పొచ్చు.