నేడు శాస్త్ర సాంకేతికతతో ప్రపంచం దూసుకుపోతున్నది. భారతదేశం కూడా ఆధునిక వైజ్ఞానిక ఆవిష్కరణలతో ముందుకు వెళ్తున్నది. మరోవైపు మూఢ నమ్మకాలు మనల్ని అథఃపాతాళానికి నెట్టుతున్నాయి. మరి ఈ మూఢ నమ్మకాలు చదువురాని అమాయక ప్రజలే నమ్ముతారని ఆలోచన సమాజంలో ఉంది. కానీ విద్యావంతులు, పాలకులు సైతం అంధ విశ్వాసాలు నమ్ముతున్న తీరును ఆశ్చర్యపరుస్తున్నది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గత కొన్ని నెలలుగా కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి తెలంగాణ వాళ్ళ దిష్టి కారణమని చెప్పడం విస్మయం కలిగిస్తుంది. ఆయన కోట్లాది ప్రజలకు సినిమా హీరో, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి. సమాజాన్ని తప్పుదోవ పట్టించే ఇలాంటి అశాస్త్రీయమైన మాటలు అంధకారానికి నిదర్శనం. భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఇవి ప్రాంతీయ విద్వేషాలను కూడా రగిలిస్తున్నాయి. అసలు కొబ్బరి చెట్లు ఎండి పోవడానికి సముద్రపు నీరు వెనక్కి రావడం, మురుగు కాలువ నీటిలో లవణాల శాతం పెరగడం వంటి కారణాలను నివేదికలు చెబుతున్నాయి. మహిమ గల వ్యక్తిగా దిష్టి గురించి చెప్పడం పాలకుల అజ్ఞానానికి నిదర్శనం. ఇది ఒక రకంగా రాజకీయంగా తన ఉనికి మూఢ నమ్మకాలతో మూడు పెట్టినట్టుంది. ఇటీవల కాలంలో దేశంలో కొందరు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు సైతం కూడా మూఢత్వాన్ని పెంచి పోషించే వ్యాఖ్యలు చేస్తున్నారు.
మనిషి వైజ్ఞానిక ఫలాలు అనుభవిస్తూనే.. అంధత్వంలోకి జారుకుంటున్నాడు. ఇప్పటికే మంత్రగాళ్ళు, జ్యోతిష్కులు, బాబాలు, స్వాములతో ప్రజలు మోసపోతున్నారు. బాణమతి, చేతబడినీ నమ్ముతున్నారు. ఎడమ కాళ్లకు నల్లదారం కట్టుకునే సంస్కృతి పెరుగుతున్నది. తల్లి కడుపులోంచి పుట్టబోయే బిడ్డను ముహూర్తాలు చూస్తున్నారు. మనిషి మరణానికి సైతం మంచి చెడు చూస్తున్నారు. ప్రజల్లో అంధ విశ్వాసాలు ఏ స్థాయిలో ఉన్నాయో దీన్ని బట్టి అర్థమవుతుంది. క్షుద్రపూజల వంటి ఘటనలు నిత్యం ఎక్కడో ఒకచోట వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో జోగిని వ్యవస్థ కొనసాగుతుంది. ముఖ్యంగా కరీంనగర్, వరంగల్ జిల్లాలోని ప్రాంతంలో మెజారిటీ గ్రామాల ప్రజలు వేములవాడ ప్రాంతానికి చెందిన దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీరాజరాజేశ్వర స్వామి పేరు మీద లింగధారణ చేసుకొని దేవునికి అంకితమవుతున్నారు. ఈ ఆచారం ముఖ్యంగా దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాల్లోనే ఉంది. ఏ ఒక్క అగ్రకులం కూడా ఇలాంటి లింగ ధారణ చేయరు. దేవుని పేరిట ఆచారంలో కూడా అట్టడుగు వర్గాలను బలి చేస్తున్నారు. ఇటీవల తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో డబుల్ బెడ్‌రూమ్ భూమి పూజ సందర్భంగా గర్భిణీ మహిళలు, వితంతువులు కొబ్బరి కాయలు కొట్టడానికి వెనుకాడుతున్నరని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఇది మూఢాచారాలు, విశ్వాసాలు, అవగాహన లోపాలకు నిదర్శనమన్నారు. ఇంత సైన్స్ అభివృద్ధి చెందినప్పటికీ ప్రజలు శాస్త్రీయ జీవన విధానాన్ని అవలంబించకపోవడం దురదృష్టకరం.
నేడు సైన్స్ ఎంతగానో అభివృద్ధి చెందినప్పటికీ ఇప్పటికీ గ్రామ ప్రాంత ప్రజలు అస్వస్థతకు గురైనప్పుడు బాబాలను, స్వాములను, సిగం ఊగే వాళ్లను, పాస్టర్లును ఆశ్రయిస్తున్నారు. వారు ఇచ్చే పసుపు, కుంకుమ, విభూతిని, నిమ్మకాయలను, కొబ్బరికాయలను రాత్రిపూట ఆది, గురువారం, అమావాస్య రోజున గ్రామ ప్రాంత నడి వీధుల్లో పెట్టి వారి రోగాలకు స్వాంతనగా భావిస్తారు. పట్టణాల్లో కొందరు విద్యావంతులు సైతం ఇలాంటి అజ్ఞానాన్ని ఆచరించడం ఆందోళన కలిగిస్తుంది. ఇటీవల రంగురాళ్లు ధరించడం, సంఖ్యా శాస్త్రం ఆధారంగా పేర్లు మార్చుకోనే వారి సంఖ్య పెరిగింది. ఇప్పటికీ కొన్ని గ్రామాలో విజృంభించిన వ్యాధులను తగ్గించుకోవడానికి జంతుబలులు, నరబలులు చేస్తున్నారని వార్తలు వినబడుతున్నాయి. ఇటీవల కరీంనగర్ జిల్లాలోని ఇల్లందకుంట మండలం, మర్రివానిపల్లి గ్రామంలో ఐదు నెలలుగా వరుస మరణాలు సంభవించాయి. గ్రామానికి కీడు సోకిందని, వరుస మరణాలు జరుగుతున్నాయని భావించిన ప్రజలు, ఒక పండితుడి సూచనతో ఆ ఊరిని విడిచిపెట్టి, పొలాల వద్దకు వెళ్లి వంటలు చేసుకుని భోజనం చేశారు. ఇలాంటి మూఢ నమ్మకాలను అజ్ఞానులతో పాటు విజ్ఞానులు కూడా పాటించడం చాలా విచారించదగ్గ విషయం. మంత్రాల నేపంతో దాడులు, హత్యలు పెరుగుతున్నాయి. మానసిక బలహీనత వలన విచక్షణ కోల్పోయి అతీంద్రియ శక్తులు నమ్మడం వల్లనే సమాజంలో ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి. ఇవి శాంతిభద్రకు విఘాతం కలిగిస్తున్నాయి.
ప్రజల్లో రోజురోజుకు శాస్త్రీయ వైఖరి, ప్రశ్నించే తత్వం లోపించడమే ఈ గుడ్డి నమ్మకాలకు కారణం. ఇదే కాకుండా పాలకుల్లో కూడా శాస్త్రీయ వైఖరి లోపించడం, ప్రభుత్వ విధానాలు కూడా దీనికి ప్రధాన కారణమని చెప్పవచ్చు. మితిమీరిన మతవిశ్వాసాలు, అశాస్త్రీయ బోధనలు, ప్రభుత్వ విధానాలు, మీడియా ప్రకటనలు ప్రజల్ని మరింత మూఢత్వ దిశగా ప్రేరేపిస్తున్నాయి. మన దేశంలో గుళ్ళు, గోపురాలు, చర్చిలు, మసీదులకు ఇచ్చినంత ప్రాముఖ్యత విద్యాలయాలకు ఇవ్వడం లేదు. సైన్స్ ఆవిష్కరణల కన్నా సూడో సైన్స్‌కు ఆదరణ పెరిగిపోతుంది. భూత వైద్యానికి, అతీంద్రియ శక్తులకు ఆదరణ పెరుగుతుంది. సమాజ అభివృద్ధికి మూలం విజ్ఞాన శాస్త్రవే. కావున విద్యాసంస్థల్లో శాస్త్రీయ ప్రగతిశీల విద్య అభ్యసనం జరగాలి. ప్రభుత్వాలు హేతుబద్ధ, శాస్త్రీయ ఆలోచన విధానాలను ప్రోత్సహించాలి. నిత్య సమస్యలను ఎదుర్కోవడానికి గల శాస్త్రీయ పరిష్కారాలను ప్రజలకు తెలియచేయాలి. సైన్స్ ప్రచార సంస్థలు కూడా ఆ దిశగా కృషి చేయాలి. అప్పుడే దేశంలో వేళ్లూనుకొని ఉన్న సామాజిక రుగ్మతలను నిర్మూలించవచ్చు. మన విశ్వవిద్యాలయాలు పరిశోధన కేంద్రాలుగా ఎదగడానికి కావాల్సిన వాతావరణాన్ని కల్పించాలి. ఇవీ నవ కల్పనలకు నాంది పలుకాలి. యువతను పరిశోధన వైపు ఆకర్షించే విధంగా ప్రభుత్వం ప్రోత్సహించాలి. రాజకీయ నాయకుల ఆలోచన, ప్రభుత్వ పరిపాలన ప్రగతి శీలంగా ఉండాలి. అప్పుడే ప్రజల్లో వైజ్ఞానిక చైతన్యం వస్తుంది.