కర్ణాటక మాజీ సిఎం , బీజేపీ సీనియర్ నేత బిఎస్‌యడ్యూరప్పకు సుప్రీం కోర్టు ఊరట నిచ్చింది.న ఆయనపై దాఖలైన పోక్సో కేసు విచారణపై స్టే విధించింది. పోక్సో చట్టం కింద చార్జిషీట్‌ను ట్రయల్ కోర్టు పరిగణన లోకి తీసుకోవడాన్ని సమర్ధిస్తూ , విచారణకు హాజరుకావాలని ఆదేశించిన కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును సవాల్ చేస్తూ యడ్యూరప్ప స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఫిబ్రవరి18న ఫాస్ట్‌ట్రాక్ ప్రత్యేక కోర్టు యడ్యూరప్పతోపాటు ముగ్గురు నిందితులను మార్చి 15న తన ఎదుట హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే కోర్టు ఆదేశాలతోపాటు ఫిర్యాదు సైతం కొట్టి వేయాలని యడ్యూరప్ప హైకోర్టులో సవాల్ చేశారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ రాజకీయ ప్రేరేపితమని యడ్యూరప్ప స్పష్టం చేశారు. అయితే కేసును కొట్టివేసేందుకు కోర్టు నిరాకరించడంతో యడ్యూరప్ప సుప్రీం కోర్టును ఆశ్రయించారు.