మందు తాగే వారికో దేవుడు, రెండు పెళ్ళిళ్ళు చేసుకునే వారికో దేవుడు ఉన్నారంటూ హిందూ దేవుళ్ళను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అవమానించారని బిజెపి రాష్ట్ర శాఖ బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చింది. మహిళా మోర్చా, యువ మోర్చా అధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు, సిఎం దిష్టి బొమ్మలు దగ్దం చేయనున్నట్లు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. బుధవారం ఉదయం 11.30 గంటలకు నాంపల్లిలోని
పార్టీ కార్యాలయం నుంచి భారీ ఊరేగింపు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో తాను చెప్పిందే నిజమవుతున్నదని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హిందూ సమాజం ఆలోచించాలని, విడిపోయి అవమానాన్ని దిగమింగుతారా, ఏకమై సత్తా చాటుతారా? అనేది హిందూ సమాజం ఆలోచించుకోవాలని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్ళను, హిందువులను అవమానించారని ఆయన మండి పడ్డారు. కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికీ మజ్లిస్ పార్టీకి కొమ్ముకాస్తున్నదని దీంతో స్పష్టమైందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ నరనరాల్లో హిందూ ద్వేషాన్ని నింపుకున్నదని ఆయన విమర్శించారు. తమ పార్టీ ఏనాడూ ఇతర మతాలను కించపరచలేదని మంత్రి బండి సంజయ తెలిపారు.