ప్రజల గోప్యతపై దాడి అంటూ విపక్షాల నిరసన
సెల్‌ఫోన్లలో సంచార్ సాథీ యాప్ తప్పనిసరి అని కేంద్రం ఆదేశాలు
న్యూఢిల్లీ : ‘సంచార్ సాథీ’ అంశం మంగళవారం పార్లమెంట్ ఉభయసభల్ని కుదిపేసింది. దేశంలో విక్రయించే అన్ని కొత్త స్మార్ట్‌ఫోన్లలో సంచార్‌సాథీ యాప్‌ను ప్రీఇన్‌స్టాల్ (డిఫాల్ట్‌గా) చేయాలంటూ కేంద్రం ఇచ్చిన ఆదేశాలపై విపక్షాలు మండిపడుతున్నాయి.పార్లమెంట్‌లో మంగళవారం ఈ అంశంపై తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. ప్రథానంగా కాంగ్రెస్, శివసేన, ఎంబిటి, టిఎంసి దీన్నితీవ్రంగా విమర్శిస్తూ ఇది ప్రజల ప్రైవసీ ఉల్లంఘనే అంటూ సభా కార్యక్రమాలకు అడ్డుతగిలాయి. దీంతో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. విపక్ష కాంగ్రెస్ దీని మీద వాయిదా తీర్మానం దాఖలుచేసి సంచార్ సాథీపై విస్తృత చర్చ కావాలని డిమాండ్ చేసింది. సంచార్‌సాథీయాప్ , ఫోన్ యూజర్ల కదలికలను, మెసేజెస్ , కాల్స్ మానిటర్ చేస్తుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ దీనిని ఇదొక డిస్టోపియన్ టూల్ అని, ఇది ప్రతిభారతీయుడిని మానిటర్ చేయడమే కాకుండా, వారి ఆర్థిక హక్కులపై దాడిగా అభివర్ణించారు. దీని అమలు రాజ్యాంగ విరుద్ధమని విమర్శించారు.
లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపి రేణుకా చౌదరి దీనిపై వాయిదా తీర్మానం దాఖలు చేశారు. శివసేన యుబిటీ ఎంపి ప్రియాంక చతుర్వేది మాట్లాడుతూ ఇది ఒక దారుణమైన పరిణామమని, ఇది భవిష్యత్తులో నియంతృత్వానికి దారి తీస్తుందని, ప్రజల గోప్యతను హరిస్తుందన్నారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాగరిక ఘోష్ కూడా దీనిని తీవ్రంగా తప్పుబట్టారు. ఇది ప్రభుత్వంపై నమ్మకాన్ని సన్నగిల్లేలా చేస్తుందని విమర్శించారు. విపక్షాల ఆందోళన నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, సంచార్ సాథీ యాప్‌పై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. సంచార్ సాథీ మీద చర్చకు ప్రభుత్వం వ్యతిరేకం కాదని, కానీ ఎజెండా ప్రకారం సెషన్‌లో 14 బిల్లులపై ఫోకస్ పెడదామని సూచించారు.
అటు, డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికామ్ కూడా దీనిపై స్పందించింది. సంచార్ సాథీ కేవలం ప్రజల సైబర్ సెక్యూరిటీ కోసం ఉద్దేశించింది మాత్రమేనని, ఇందులో ప్రైవసీ ఉల్లంఘన లేదంది. ఈ యాప్ యూజర్ డేటా రక్షిస్తుందని తెలియజేసింది. ‘సంచార్ సాథీ’ యాప్‌పై కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వివరణ ఇచ్చారు. వినియోగదారులు అక్కర్లేదనుకుంటే తమ స్మార్ట్ ఫోన్ల నుంచి యాప్‌ను డిలీట్ చేయవచ్చని చెప్పారు. ఇది ఐచ్ఛికమని అన్నారు. ప్రతి ఒక్కరి కోసం ఈ యాప్‌ను ప్రవేశ పెట్టడం తన డ్యూటీ అని, డివైస్‌లో యాప్ ఉంచుకోవాలా వద్దా అనేది వినియోగదారుని ఇష్టమని తెలిపారు
సెల్‌ఫోన్‌లో సంచార్ సాథీ తప్పనిసరి అని కేంద్రం ఆదేశాలు
దేశంలో ఇక నుంచి విక్రయించే ప్రతి సెల్‌ఫోన్‌లో తప్పనిసరిగా ‘సంచార్ సాథీ’ యాప్ ముందుగానే ఇన్‌స్టాల్ చేయాలని ఫోన్ దిగుమతిదార్లు, తయారీదార్లను టెలికాం శాఖ ఆదేశించింది. 90 రోజుల్లోపు ఈ నిబంధనలను అమలు చేయాలని స్పష్టం చేసింది. ఇప్పటికే విక్రయించిన ఫోన్లలో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ ద్వారా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయాలని పేర్కొంది. ఈ దిశగా తీసుకున్న చర్యలకు సంబంధించిన కంప్లయెన్స్ నివేదికను 120 రోజుల్లోగా సమర్పించాలని తెలిపింది. ఈ యాప్ ఫోన్ యూజర్లకు స్పష్టంగా కనిపించేలా ఇన్‌స్టాల్ చేయాలని , మొదటిసారి డివైజ్ సెటప్ సమయం లోనే ఇది యూజర్లకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం యాపిల్, సామ్‌సంగ్, గూగుల్, వివో, ఒప్పో, షియోమీ వంటి ప్రధాన కంపెనీలు భారత్‌లో హ్యాండ్‌సెట్లు తయారు చేస్తున్నాయి. వీటికి తాజా ఆదేశాలు వర్తిస్తాయి. సంచార్ సాథీ ఉత్తర్వును ప్రతిఘటించిన యాపిల్
ప్రతిసెల్‌ఫోన్‌లో తప్పనిసరిగా సంచార్ సాథీ యాప్‌ను ముందుగానే ఇన్‌స్టాల్ చేయాలన్న టెలికాంశాఖ ఆదేశాలను పాటించడానికి యాపిల్ సంస్థ ముందుకు రావడం లేదని ఆయా వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈమేరకు కేంద్ర ప్రభుత్వానికి తన ఆందోళన తెలియజేయడానికి సిద్ధమైంది. దీనివల్ల ప్రపంచం మొత్తం మీద తమ కంపెనీ యొక్క ఇకోసిస్టమ్‌లో గోప్యత, భద్రతకు సంబంధించిన అనేక సమస్యలు లేవనెత్తుతాయని కేంద్రానికి చెప్పాలనుకుంటోంది. యాపిల్ తన యాప్ స్టోర్‌ను దాని యాజమాన్య ఐఒఎస్‌సాఫ్ట్‌వేర్‌ను కట్టుదిట్టంగా నియంతిస్తుంటుంది. ఏటా 100 బిలియన్ డాలర్ల వాణిజ్యానికి ఈ వ్యవస్థలు చాలా కీలకం. అయితే ఈ విషయంలో కోర్టును ఆశ్రయించడం కానీ లేదా ప్రభుత్వ వైఖరిని అనుసరించడం కానీ యాపిల్ చేయదని ఆయా వర్గాలు పేర్కొన్నాయి. శామ్‌సంగ్ వంటి సంస్తలు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను సమీక్షిస్తున్నట్టు చెప్పాయి.