మందు తాగే వాళ్ళకో దేవుడు ఉన్నారని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్య చేశారు. మంగళవారం గాంధీ భవన్‌లో పిసిసి విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ డిసిసి నూతన అధ్యక్షులకు దిశా నిర్ధేశం చేశారు. పార్టీలో కష్టపడి పని చేసే వారికే గుర్తింపు ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ ఉంది కాబట్టే నిలబడిందని, లేకపోతే జనతా పార్టీలా, మరో పార్టీలా మూతపడేదని అన్నారు. “హిందువులకు ఎంత మంది దేవతలు, దేవుళ్ళు ఉన్నారు?, మూడు కోట్ల మంది ఉన్నారా?” అని ఆయన అంటూ ‘పెళ్ళికాని వారికి హనుమంతుడు, రెండు పెళ్ళిళ్ళు చేసుకున్న వారికో దేవుడు, మందు తాగే వారికో దేవుడు, ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ కల్లు పోయాలి, కోడి కోయాలి అనోటోళ్ళకు, పప్పు తినే వారికో దేవుడు ఉన్నారు..అవునా,
అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు..’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. దేవుళ్ళపైనే ఏకాభిప్రాయం లేదని, అలాగే డిసిసి అధ్యక్షుల విషయంలో ఏకాభిప్రాయం ఎలా తేగలమని అన్నారు. తాను సిఎం కావడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందన్నారు. అదేవిధంగా మీరు కూడా కష్టపడాలని, కాంగ్రెస్‌లో ఏదైనా సాధ్యమని ఆయన తెలిపారు. కాళ్ళలో కట్టే పెట్టే వారుంటారని ఆయన చెప్పారు. తాను ఫుట్ బాల్ ప్రాక్టిస్ చేస్తున్నానని, అదిగో ముఖ్యమంత్రి బాల్‌ను కాలితో తన్నుతున్నారంటే ఎలా?, ఫుట్ బాల్ అంటేనే కాలితో తన్నుతారని ఆయన అన్నారు. ఆటలో బొర్లా పడతామని, పడగానే ఇక లేవరని అనుకోరాదని, పడగానే లేచి నిలబడే వాడే ఆటగాడని ఆయన తెలిపారు. రాజకీయాల్లోనూ అదే విధంగా ఉంటుంది కాబట్టి మీరంతా కష్టపడి పని చేయాలని డిసిసిలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిత బోధ చేశారు.