మాజీ ప్రధాన మంత్రి, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్‌ను ఆయన సోదరి ఉజ్మా ఖానుమ్ కలిశారు. ఇమ్రాన్ ఆరోగ్యంపై వస్తున్న వదంతుల నేపథ్యంలో ఆయనను కలిసేందుకు జైలు అధికారులు మంగళవారం అనుమతించారు. దీంతో పాకిస్తాన్ లోని అడియాలా జైలులో ఇమ్రాన్ ను ఆయన సోదరి ఉజ్మా కలిశారు. అనంతరం జైలు బయట ఆమె మీడియాతో మాట్లాడారు. జైలులో ఇమ్రాన్ ఖాన్ సురక్షితంగానే ఉన్నట్లు తెలిపారు. కానీ ఆయనను మానసికంగా వేధిస్తున్నారని ఆమె ఆరోపణలు చేశారు.
కాగా, జైలులో ఇమ్రాన్ ఖాన్ మరణించినట్లు గత వారం రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిదే. ఆయనను జైలులో చిత్రహింసలకు గురిచేసి చంపినట్లు బలూచిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సంచలన ఆరోపణలు చేసింది. ఇమ్రాన్ ఆరోగ్యంపై పుకార్లు రావడంతో కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు, మద్దతుదారులు పెద్ద ఎత్తున రావిల్పిండిలోని అడియాలా జైలు వద్ద ఆందోళనకు దిగారు. ఆయనను కలిసేందుకు అనుమతివ్వాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో కుటుంబంలోని ఒకరికి మాత్రమే అనుమతించడంతో ఇమ్రాన్ సోదరి ఉజ్మా జైలులోకి ఆయన వెళ్లి కలిశారు.