కాంగ్రెస్ ప్రభుత్వం భూ దందా కోసం హిల్ట్ పాలసి తెచ్చిందని, ఇందుకోసం జిఒ విడుదల చేశారని బిఆర్‌ఎస్ నేత, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ పేర్కొన్నారు. దాదాపు పది వేల ఎకరాల ప్రభుత్వ భూములను కారు చౌకగా కట్టబెట్టేందుకే ఈ పాలసీ తెచ్చారని ఆరోపించారు. కేవలం 45 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసి డబ్బులు దండుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం ఎంఎల్‌సి తక్కెళ్లపల్లి రవీందర్ రావు, మాజీ ఎంపి బడుగుల లింగయ్యలతో కలిసి మీడియాతో మాట్లాడారు. కెసిఆర్ హయాంలో పరిశ్రమల స్థాపనకు టిఎస్‌ఐపాస్ తెచ్చి 15 రోజుల్లో అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకుందని తెలిపారు. పరిశ్రమలకు భూములు ఇచ్చే సమయంలోనే కాదు అమ్మేటప్పుడు కూడా ప్రజాభిప్రాయ సేకరణ చేయానలి, పర్యావరణ వేత్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. మంత్రి శ్రీధర్ బాబు లీజు భూములకు హిల్ట్ వర్తించదని చెబుతున్నారని, జిఒలో మాత్రం తొమ్మిది వేల ఎకరాలపైనే ప్రస్తావించారని అన్నారు.బిఆర్‌ఎస్ పాలనలో ఇలాంటి ఇఒలు ఎపుడూ ఇవ్వలేదని, పారదర్శకమైన విధానం అమలు చేశామని పేర్కొన్నారు. వ్యవసాయ రంగంతో పాటు పరిశ్రమలు నడిపేలా చూడటం ప్రభుత్వ భాద్యత అని వ్యాఖ్యానించారు.
పరిశ్రమలు లేకపోతే ఉపాధి ఎట్లా..? అని ప్రశ్నించారు. ఒఆర్‌ఆర్ అవతలకు పరిశ్రమలు స్థాపింవే అవకాశం పారిశ్రామిక వేత్తలకు కల్పించాలని, బిడ్డింగ్ ద్వారా ఉపయోగంలో లేని పరిశ్రమల భూములను అమ్మాలని పేర్కొన్నారు. చాలా రాష్ట్రాల్లో ఈ పద్దతి అమలవుతోందని చెప్పారు. హిల్ట్ పాలసీ రావడం వెనుక వేల కోట్ల రహస్య ఒప్పందాలు ఉన్నాయని ఆరోపించారు. ఫ్యూచర్ సిటీలో ఉపాధి కల్పించే పరిశ్రమలు రావడం లేదని అన్నారు. ఫిలిం యూనిట్లపై ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు తప్ప మానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ రావడం లేదని విమర్శించారు. ఎంఎల్‌సి తక్కెళ్లపల్లి రవీందర్ రావు మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ బ్రోకర్ అవతారమెత్తారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. విలువైన భూములు ప్రభుత్వ సంపద అని, ఈ సంపదను హిల్ట్ పేరుతో సిఎం, ఆయన ఆత్మీయులు కొల్లగొట్టే ప్రణాళిక వేశారని అన్నారు. మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి భూ దందాలతో దోచుకో దాచుకో అనే విధానంపైనే రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారని మండిపడ్డారు. బిసిలతో సహా అందరిని మోసం చేసిన చరిత్ర రేవంత్ రెడ్డిది అని మండిపడ్డారు. హిల్ట్ పాలసీపై ప్రభుత్వాన్ని వదిలి పెట్టేది లేదని హెచ్చరించారు.