టీమిండియా స్టార్ క్రికెటర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ క్రికెట్ ఆడుతున్న సమయంలో తాను స్కూల్ లో చదువుకుంటున్నానని దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా అన్నాడు. మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా రెండో వన్డే బుధవారం రాయ్‌పూర్‌లో జరగనుంది. మొదటి వన్డేకు దూరమైన కెప్టెన్ బావుమా తిరిగి జట్టుతో కలిశారు. రెండో వన్డేకు ముందు రాయ్‌పూర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో బావుమా మాట్లాడుతూ.. 2007 T20 ప్రపంచ కప్ సమయంలో దక్షిణాఫ్రికా జట్టుతో ఆడుతున్నప్పుడు రోహిత్ ఆటను తాను మొదటిసారి చూశానని.. అప్పుడు తాను ఇంకా పాఠశాల విద్యార్థినేనని గుర్తుచేసుకున్నాడు.
“రోహిత్, విరాట్ కోహ్లీలు ప్రపంచస్థాయి ఆటగాళ్లు. వీరిద్దరూ తిరిగి రావడంతో భారత జట్టు బలంగా మారింది. వీరిద్దరూ అంతర్జాతీయ క్రికెట్‌లో ఆధిపత్యం చెలాయించారు. వీరికి చాలా అనుభవం, నైపుణ్యం ఉంది. అయినా వారిని ఎదుర్కోవడం మాకు కొత్తేమీ కాదు. వారితో చాలా మ్యాచ్ లు ఆడాం. కొన్ని సార్లు పైచేయి కూడా సాధించాం. ఇవన్నీ సిరీస్‌ను మరింత ఉత్తేజకరంగా చేస్తాయి” అని బావుమా పేర్కొన్నాడు. ఈ సందర్భంగా మొదటి వన్డేలో 39 బంతుల్లో 70 పరుగులు చేసి దక్షిణాఫ్రికాను విజయం అంచుకు తీసుకెళ్లిన మార్కో జాన్సెన్‌ను బవుమా ప్రశంసించారు. కాగా, తొలి వన్డేలో దక్షిణాఫ్రికాపై భారత్ 17 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగాగా, రోహిత్ అర్థసెంచరీతో రాణించాడు.