హైదరాబాద్: ఈ ఏడాది జరిగిన ఆసియాకప్ సూపర్-4లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో టీం ఇండియా ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యాకు గాయమైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అతడు జట్టుకు దూరంగా ఉంటున్నాడు. ఇటీవల గాయం నుంచి కోలుకున్న అతడు ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పాల్గొంటున్నాడు. ఈ టోర్నమెంట్‌లో బరోడా జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న హార్థిక్, పంజాబ్‌తో ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెలరేగిపోయాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 222 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (50, 19 బంతుల్లో) మెరుపు హాఫ్ సెంచరీ చేయగా.. అన్మోల్‌ప్రీత్ సింగ్ (69), నమన్ ధీర్(39) స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన బరోడా 19.1 ఓవర్లలో 224 పరుగులు చేసి లక్ష్యాన్ని చేధించింది. హార్థిక్ పాండ్యా (77, 42 బంతుల్లో) అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చాడు. శివలిక్ శర్మ (47), విష్ణు సోలంకి(43) రాణించారు. దీంతో బరోడా ఈ టోర్నమెంట్‌లో రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. హార్థిక్ బ్యాటింగ్ చూస్తే.. సౌతాఫ్రికాతో జరిగే టి-20 సిరీస్‌కి హార్థిక్ సిద్ధంగా ఉన్నాడని తెలుస్తోంది.