ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 కోసం డిసెంబర్ 16న అబుదాబిలో మినీ వేలం జరుగనుంది. అయితే, చాలా మంది ఆటగాళ్లు వివిధ కారణాలతో ఈ వేలం నుంచి తప్పుకుంటున్నారు. తాజాగా ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఈ వేలానికి తన పేరును నమోదు చేసుకోలేదని తెలుస్తోంది. గత ఐపిఎల్ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు తరఫున ఆడిన మ్యాక్స్‌వెల్ పేలవ ప్రదర్శన చేశాడు. ఏడు మ్యాచుల్లో కేవలం 48 పరుగులు మాత్రమే చేసి.. నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత గాయం కారణంగా ట్రోర్నమెంట్‌కి దూరమయ్యాడు.
ఇప్పటికే వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు ఆండ్రీ రస్సెల్ ఐపిఎల్ 2026 నుంచి రిటైర్‌మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. రస్సెల్‌ని కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు ‘పవర్ కోచ్’గా నియమించింది. అంతేకాక సౌతాఫ్రికా ఆటగాడు ఫాఫ్ డుప్లెసిస్, ఇంగ్లండ్ ఆటగాడు మొయిన్ అలీ ఐపిఎల్‌లో ఆడటం లేదని ప్రకటించారు. వీరిద్దరు పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో పాల్గొంటామని పేర్కొన్నారు. ఇక ఈసారి వేలంలో 1,355 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. అన్ని జట్లలో కలిపి 77 స్లాట్లు ఖాళీగా ఉన్నాయి. ఇందులో విదేశీ స్లాట్లు 31. కోల్‌కతా నైట్‌రైడర్స్ వద్ద అత్యధికంగా రూ.64.3 కోట్లు పర్స్ ఉండగా.. చెన్నై సూపర్ కింగ్స్ వద్ద రూ.43.4 కోట్ల పర్స్ ఉంది.