తెలంగాణ రాష్ట్రరాజకీయాలలో 2023 ఎన్నికలు ఒక మలుపు, మార్పు, మానసిక వాతావరణంలోని ఓ అల్లకల్లోల క్షణం. పది సంవత్సరాలపాటు సాగిన బిఆర్‌ఎస్ పాలన తరువాత ప్రజలు కోరుకున్న కొత్త తెలంగాణ, పారదర్శక పాలన, సంక్షేమం -సంస్కరణల కలయిక అనే ఆత్రుత రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చింది. ఆరు హామీల ప్రభుత్వం అనే నినాదంతో ప్రజల్లో ఆశాభావాన్ని పెంచిన ఈ ప్రభుత్వం మొదటి రోజునుండే నిర్ణయాల వేగాన్ని, పరిపాలనా తీరు మారుస్తామనేదాన్ని ప్రదర్శించింది. అయితే శాసనసభలో గెలుపు ఒకటి, పరిపాలనా గడపలో అడుగుపెట్టిన తరువాత ఎదురయ్యే ఆర్థిక వాస్తవాలు, వ్యవస్థల సంక్లిష్టత, విభాగాల అంతర్గత గందరగోళం, అధికారులు- మంత్రుల మధ్య సమన్వయ లోపం, పెద్ద ఎత్తున పెరిగిన అప్పు భారాలు-వివిధ దిశల్లో ప్రభుత్వాన్ని పరీక్షించిన రెండు సంవత్సరాలు ఇవి. సంకల్పం స్పష్టంగా ఉన్నా, అమలులో ఎదురైన సంక్లిష్టత పాలనకు ప్రత్యేక స్వరూపాన్ని ఇచ్చిన కాలమిది. ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజునే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అందించడం రాజకీయంగా పెద్దగా ప్రశంసించబడింది.
రోజుకు సగటున 25- 28 లక్షల మహిళలు ఈ సేవను వినియోగిస్తున్నారని రవాణా శాఖ వివరాలు చెబుతున్నప్పటికీ, టిఎస్ ఆర్‌టిసిపై నెలకు రూ. 250- నుంచి రూ. 280 కోట్లు వరకు అదనపు భారం పడుతోంది. అప్పటికే రూ. 7,000 కోట్లకు పైగా అప్పుల్లో ఉన్న సంస్థకు ఈ పథకం ఆర్థిక రీతిలో తీవ్రమైన ఒత్తిడిని కలిగించింది. సంక్షేమం పట్ల ప్రభుత్వ నిబద్ధతను ఈ పథకం ప్రతిబింబించినా, దీర్ఘకాలంలో దీనిని నిలబెట్టే మార్గం, చెల్లింపుల సమయపాలన రాష్ట్ర ఖజానాకు కఠిన పరీక్ష. ఇటువంటి సంక్షేమం వినిపించే శబ్దం ప్రజాపక్ష పాలనను సూచించినప్పటికీ, ప్రభుత్వ ఆర్థిక ఆరోగ్యం మాత్రం రోజుకు సగం కోట్ల రూపాయల బరువును మోయాల్సి వచ్చింది. ఆరోగ్య రంగంలో ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 10 లక్షలకు పెంచిన నిర్ణయం మరింత ఆదరణ పొందినా, దీనివల్ల రాష్ట్ర ఖర్చులు సంవత్సరానికి అదనంగా రూ. 1,500- 2,000 కోట్లకు పెరగవచ్చని ఆర్థిక నిపుణులు గమనిస్తున్నారు.
జిల్లా ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది 30% -40% వరకు ఖాళీలతో పనిచేయాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో కార్పొరేట్ ఆసుపత్రులే వైద్యంలో ప్రధాన ఆశ్రయం కావడం ప్రభుత్వ బిల్లులను పెంచుతోంది. ప్రజల ప్రయోజనానికి తీసుకున్న నిర్ణయాలు తక్షణ ఉపశమనం ఇస్తున్నప్పటికీ, ఆర్థిక నిర్వహణలో ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఇబ్బందులు గణాంకాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. వ్యవసాయ రంగం ప్రభుత్వానికి పెద్ద సవాలుగానే ఉంది. రాష్ట్రంలో వ్యవసాయ రుణాలు మొత్తం రూ. 32,000 కోట్లకు చేరాయి. మాఫీని దశలవారీగా చేసే ప్రయత్నాలు ప్రారంభమైనా పూర్తి అమలు కాలేకపోయాయి. ధాన్యం కొనుగోళ్లలో చెల్లింపుల జాప్యం, ఎండలతో పాడైపోయిన పంటలకు పరిహారం ఆలస్యం, మార్కెట్ ధరల్లో మార్పులు రైతుల నిరాశను పెంచాయి. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలపై ప్రభుత్వం చేసిన విమర్శలు సాంకేతిక పరిశీలనకు దారితీశాయి. పంపింగ్ స్టేషన్లు తరచూ నిలిచిపోవడం, వ్యయ అధికరణలపై వివాదాలు సాగునీటిపరంగా రైతులకు ఇబ్బందులు కలిగించాయి.
నీటిపారుదలే తెలంగాణ రైతు ఆత్మ విశ్వాసానికి పునాది అయిన సందర్భంలో ఈ అంశాలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు మోపాయి. విద్యా రంగంలో ప్రభుత్వానికి ఎదురైన సంక్షోభం మరింత లోతుగానే ఉంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ. 800 కోట్లకు పైగా పెరగడంతో ప్రైవేట్ కళాశాలలు నిరసన వ్యక్తం చేస్తూ మూడు రోజుల బంద్‌కు దిగడం విద్యార్థుల్లో అనిశ్చితిని సృష్టించింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ నియామకాలు ఆలస్యం, సిబ్బంది కొరత, మధ్యాహ్న భోజనం, పాఠశాల మౌలిక వసతుల అభివృద్ధి వంటి అంశాల్లో నెమ్మదిగా సాగినా ప్రగతిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ రెండు సంవత్సరాల్లో అత్యంత క్లిష్ట దృశ్యం రాష్ట్ర ఆర్థిక స్థితి. రాష్ట్ర అప్పు మొత్తం రూ. 3.8- రూ. 4 లక్షల కోట్ల మధ్య తిరుగుతూ ఉండగా ఏటా వడ్డీ చెల్లింపులకు మాత్రమే రూ. 25,000 కోట్లకు పైగా ఖర్చవుతోంది. రెవెన్యూ వృద్ధి రేటు 7-9% మధ్య ఉంటే ప్రభుత్వ ఖర్చులు 15% కంటే ఎక్కువగా పెరుగుతున్నాయి.
పూర్వప్రభుత్వంలో ప్రారంభమైన భారీప్రాజెక్టుల నిర్వహణ వ్యయం, విద్యుత్ సంస్థల అప్పులు, పెన్షన్ భారం, కేంద్ర నిధులలో వచ్చిన తగ్గుదల-కలగలిపి-రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గణనీయంగా, అసమతులంగా మార్చాయి. ఆదాయం పెంచే కొత్త మార్గాల కోసం ప్రభుత్వం మద్యపాన ఆదాయంపై దృష్టి పెట్టినప్పటికీ, సామాజిక దృష్టిలో ఇది పెద్ద విమర్శలకే దారి తీసింది. మరో వైపు ప్రభుత్వం-, అధికార యంత్రాంగం మధ్య సహకారం కొన్నిసార్లు సరిగా పనిచేయలేదు. ముఖ్య శాఖల్లో అధికారులు తరచు బదిలీలు, మంత్రుల ఆదేశాలు అమలులో ఆలస్యం, ఫైళ్ల నిల్వ, ప్రధాన కార్యాలయం- శాఖల మధ్య కమ్యూనికేషన్ లోపాలు పాలన నెమ్మదించే ప్రధాన కారణాలు అయ్యాయి. కొందరు మంత్రులు ప్రజా వేదికలపై అధికారులు తమ ఆదేశాలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేయడం, కొందరు అధికారుల నిర్ణయాలు రాజకీయ వివాదాలకు దారితీయడం పాలనా లోపాలను బహిర్గతం చేశాయి. సంక్షేమం, -అభివృద్ధి-, ఆర్థిక నియంత్రణ అనే మూడు అక్షాంశాలలో సమతుల్యత సాధించడంలో ప్రభుత్వం ఇంకా కృషి చేయాల్సిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజలు రాజకీయ మార్పు కోసం ఇచ్చిన ఓటు ఇప్పుడు ఫలితాల రూపంలో కనబడాలని ఆశిస్తున్నారు. మూడవ సంవత్సరంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలే పాలన భవిష్యత్తును నిర్ణయిస్తాయి.
– రామకిష్టయ్య సంగనభట్ల, 9440595494