సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.32 గా రూపొందుతోన్న చిత్రానికి ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ అనే ఆసక్తికర టైటిల్ ను ఖరారు చేశారు. బేబీ వంటి సంచలన విజయం తరువాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కలిసి నటిస్తున్న చిత్రమిది. ‘90s’ వెబ్ సిరీస్ తో అందరి మనసులు దోచుకున్న ఆదిత్య హాసన్, ఈ చిత్రంతో దర్శకుడిగా వెండితెరకు పరిచయమవుతున్నారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ టైటిల్ గ్లింప్స్ ఆవిష్కరణ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకలో కథానాయకుడు ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ “తల్లిదండ్రుల ఒత్తిడి వల్ల హీరో లండన్ కి వెళ్తే.. అక్కడ ఏం జరిగింది? ప్రేమ కథ ఏంటి? వంటి అంశాలతో ఈ సినిమా ఉంటుంది. తెలుగులో పూర్తిస్థాయిలో రొమాంటిక్ కామెడీ సినిమాలు పెద్దగా రావడం లేదు. ఆ లోటుని భర్తీ చేసేలా ఎపిక్ సినిమా ఉంటుంది”అని అన్నారు. దర్శకుడు ఆదిత్య హాసన్ మాట్లాడుతూ.. “ఇదొక మధ్యతరగతి యువకుడి ప్రేమ కథ. సినిమా చూసేటప్పుడు ప్రతి ఒక్కరూ తమని తాము ఊహించుకుంటారు”అని తెలిపారు. నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్ అని ఎందుకు పెట్టామంటే.. ఇది మొదటి భాగం. దీనికి కొనసాగింపు కూడా ఉంటుంది. ఒక మంచి సినిమా చేశాము”అని తెలియజేశారు. ఈ వేడుకలో కథానాయిక వైష్ణవి చైతన్య పాల్గొన్నారు.