మన తెలంగాణ/హైదరాబాద్: ‘హిల్ట్’ పాలసీ పే రిట రాష్ట్ర ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయల భూ కుంభకోణానికి ‘తెర’ లేపినందున, వెంటనే ‘హిల్ట్’ను నిలిపి వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాల్సిందిగా బిజెపి రాష్ట్ర నాయకులు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కోరారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు అధ్వర్యంలో పార్టీ నా యకులు సోమవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసి ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. గతంలో హైదరాబాద్‌లో పరిశ్రమలకు కేటాయించిన విలువైన భూములను ‘హైదరాబా ద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్‌ఫార్మేషన్ (హిల్ట్) పేరిట రియల్ ఎస్టేట్ భూములకు కేటాయించే ప్రయత్నం చేస్తున్నదని రాంచందర రావు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు వివరించారు. కాబట్టి దీనిని నిలి పి వేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాల్సిందిగా ఆయన గవర్నర్‌ను కోరారు. అనంత రం రాంచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్‌లోని సుమారు తొమ్మిది వేల ఎకరాల విలువైన పారిశ్రామిక భూములను రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసం మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన ‘హిల్ట్’ పాలసీతో అవినీతికి దారి తీస్తుందని ఆరోపించారు.
ఎస్‌ఆర్‌వో రేట్లలో ముప్పై శాతం మాత్రమే చెల్లించి భూములను మార్చుకునే విధానం వల్ల వేల కోట్ల రూపాయల ప్రజాసంపదను కోల్పోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. ఈ విధానం వల్ల వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోతారని, రైతులకూ తీవ్ర నష్టం జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. హిల్ట్ పాలసీ ద్వారా ప్రభుత్వం ఖజానా నింపుకునే ప్రయత్నం చేస్తున్నదని గవర్నర్‌కు వివరించామని ఆయన తెలిపారు. గతంలో పరిశ్రమలకు ప్రభుత్వం తక్కువ ధరలకు కేటాయించి, ప్రోత్సహించిందని ఆయన చెప్పారు. కాగా ఇప్పటి మార్కెట్ పరిస్థితులను పరిశీలిస్తే, సబ్-రిజిస్ట్రార్ (ఎస్‌ఆర్‌వో) రేట్లు అసలు మార్కెట్ విలువలతో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నాయన్న విషయం స్పష్టంగా కనిపిస్తున్నదని ఆయన తెలిపారు. ఇటీవల హైదరాబాద్ పరిసరాల్లో ఒక సంస్థ ఒక్క ఎకరాన్ని నూటా యభై కోట్ల రూపాయల వరకు కొనుగోలు చేసిందంటే ఇలా భూములు నిజమైన మార్కెట్ ధరల ఆకాశాన్ని తాకుతున్న సమయంలో హిల్ట్ పాలసీ ప్రకారం పరిశ్రమల భూములను కేవలం ఎస్‌ఆర్‌వో రేట్లలో ముప్పై శాతం మాత్రమే చెల్లించి కన్వర్ట్ చేసుకునే అనుమతి ఇవ్వడం అనుమానాలకు దారి తీస్తోందని రాంచందర్ రావు అన్నారు.