ప్మార్ట్ ఫోన్లలో సైబర్ నేరాల నియంత్రణ , ఫోన్ల చోరీల ఆటకట్టుకు సంబంధిత ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏర్పాట్లపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు వెలువరించింది. ఫోన్ల తయారీదార్లు ఇకపై తయారు చేసే ప్రతి ఫోన్‌లోనూ సైబర్ సెఫ్టీ యాప్ ఏర్పాటు అత్యవసరంగా చేయాలని ఆదేశించారు. ఈ ఏర్పాటును సంచార్ సాథీ అని వ్యవహరిస్తారు. దీని ఏర్పాటుకు సంబంధించి ఫోన్ల తయారీ కంపెనీలకు ఉత్తర్వులు వెలువరించారు. ఫోన్ల వినియోగదార్లు తమ ఫోన్ల నుంచి ఈ యాప్‌ను ఏ విధంగా కూడా తొలగించడానికి వీల్లేకుండా సరైన అమరిక ఉండాల్సిందే అని స్పష్టం చేశారు. ఇటీవలి కాలంలో ఎక్కువగా సైబర్ నేరాలు జరుగుతున్న దశలో, విద్యావంతులు కూడా ఎంతో నష్టపోతున్న కాలంలో స్మార్ట్‌ఫోన్లలో ఇటువంటి సైబర్ నేరాల చెక్ ఏర్పాటు అవసరం అని ఆయా కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం తరఫున అంతర్గత ఆదేశాలు వెలువడినట్లు ఆయా కంపెనీల ద్వారా వెల్లడైంది.
సాధారణంగా ఎక్కువగా సైబర్ నేరాలు సెల్‌ఫోన్ల సాంకేతికను వాడుకుంటూ నేరగాళ్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ దశలో సెల్‌ఫోన్లలోనే వీటిని నియంత్రించే ఏర్పాటు అవసరం అనే విషయం సాంకేతిక నిపుణుల ద్వారా గ్రహించి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ చర్యకు దిగింది. తొలిగించడానికి వీల్లేని , ప్రభుత్వ పరిధిలోని సైబర్ సెక్యూరిటీ యాప్ ఏర్పాటు విషయంలో ప్రైవేటు కంపెనీలు స్పందన తెలియలేదు. యాపిల్ , శామ్‌సంగ్ ఇతర కంపెనీలు ఈ నిబంధనను పాటించాల్సి ఉంటుంది. ప్రపంచంలోనే అతి పెద్ద ఫోన్ల మార్కెట్‌గా భారతదేశం నిలిచింది. ఇప్పటికే 1.2 బిలియన్ ఫోన్లవాడకం దార్లు ఉన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం జనవరిలో విడుదల చేసిన ఈ యాప్‌తో వినియోగదార్లు పోగొట్టుకున్న ఏడు లక్షలకు పైగా ఫోన్లను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. అక్టోబర్‌లోనే అరలక్ష వరకూ రికవరీ అయ్యాయి.