ప్రతిభగల భారతీయులను ఉపయోగించుకుని అమెరికా ఎంతో లబ్ధి పొందిందని టెస్లా సిఇఒ ఎలాన్ మస్క్ అన్నారు. హెచ్1 బి వీసాలపై ఆంక్షలు అమెరికాకే చేటు చేస్తాయని అభిప్రాయపడ్డారు. ప్రముఖ ఎంటర్‌ప్రెన్యూర్ నిఖిల్ కామత్ ‘పీపుల్ బై డబ్లూటిఎఫ్’ పాడ్‌కాస్ట్‌లో మస్క్ వీసాలు కొంత మేరకు దుర్వినియోగం అవుతున్న మాట నిజమైనప్పటికీ వాటిని పూర్తిగా కట్టడి చేయడం సరైన నిర్ణయం కాదన్నారు. ఈ విషయంలో కొన్ని ఔట్‌సోర్సింగ్ కంపెనీలను ఆయన నిందించారు. బైడెన్ హయాంలో ఏ మాత్రం నియంత్రణ లేకపోవడం, అందరికీ అన్నీ ఉచితం అనే రీతిలో వ్యవహరించారని అది కూడా సరియైంది కాదన్నారు. సరిహద్దు నియంత్రణలు లేనప్పుడు అది దేశం ఎందుకు అవుతుందని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో అమెరికాలో భారీ ఎత్తున్న అక్రమ పద్ధతిలో వలసదారులు వచ్చి పడ్డారని, అది బైడెన్ అనుసరించిన తప్పుడు విధానం వల్లేనని మస్క్ ఆరోపించారు. ఈ సందర్భంగా మస్క్ భారత్‌కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన భాగస్వామి అయిన శివోన్ జిలిస్ భారతీయ మూలాలు కలిగి ఉన్నారని అన్నారు.కెనడాలో పెరిగిన తనను చిన్న వయసులోనే దత్తతకు ఇచ్చారని అన్నారు. భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ గౌరవార్థం తన కుమారుడి పేరులో శేఖర్ అనే పదాన్ని చేర్చానని మస్క్ వివరించారు.