రాంచీ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో టీం ఇండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ అద్భుత శతకం బాదిన విషయం తెలిసిందే. 11 ఫోర్లు, 7 సిక్సుల సాయంతో 135 పరుగులు చేసి కోహ్లీ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కాగా, కోహ్లీ చాలా కాలం తర్వాత సెంచరీ చేయడంతో అటు అభిమానులే కాదు.. సహచర ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్ కూడా సంతోషంలో మునిగిపోయారు. తొలి వన్డేలో నాలుగు వికెట్ల తీసిన కుల్దీప్ కూడా తన సంతోషాన్ని పంచుకున్నాడు.
‘‘కోహ్లీ భాయ్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు నా కెరీర్ ప్రారంభమైంది. అతడు బ్యాటంగ్ చేసిన విధానం చూస్తే నేను 8-9 సంవత్సరాలు వెనక్కి వెళ్లినట్లు అనిపించింది. 2017, 2018, 2019లో ఆడినట్లు ఈ మ్యాచ్‌లో ఆడాడు. ఇది చాలా మంది ఇన్నింగ్స్, అతడు చాలా ఆత్మ విశ్వాసంతో కనిపించాడు. కోహ్లీతో కలిసి ఆడటం చాలా బాగుంది. అతడి నుంచి చాలా నేర్చుకుంటాం. బౌలర్లకు కూడా మద్దతిస్తూ ఇన్‌పుట్స్ ఇస్తుంటాడు. ఆటగాళ్లలో ఉత్సహాన్ని నింపుతాడు. అతను జట్టులో ఉండటం మా అదృష్టం’’ అని కుల్దీప్ అన్నాడు.