జైపూర్: భారత జట్టులో చోటు లభించనప్పటికీ.. యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ నిరాశ చెందకుండా క్రికెట్‌ని కొనసాగిస్తున్నాడు. అవకాశం దొరికినప్పుడల్లా మైదానంలో పరుగుల వరద పారిస్తున్నాడు. తాజా విజయ్ హజారే ట్రోఫీలో తన బ్యాట్‌ని ఝుళిపించాడు. జైపూర్ వేదికగా గోవాతో జరుగుతున్న ముంబై జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న సర్ఫరాజ్ సెంచరీతో చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గోవా జట్టు ముంబైని బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై జట్టు సర్ఫరాజ్ ఖాన్ సెంచరీ, ముషీర్ ఖాన్, కీపర్ హార్థిక్ తమర్‌ల అర్థశతకాలతో భారీస్కోర్ దిశగా దూసుకెళ్తుంది. సర్ఫరాజ్ ఖాన్ 75 బంతుల్లో 9 ఫోర్లు, 14 సిక్సులతో 157 పరుగులు చేసి ప్రత్యర్థి బౌలర్లు బెంబేలెత్తించాడు. ముషీర్ ఖాన్ 66 బంతుల్లో 60 రాణించగా.. హార్థిక్ 28 బంతుల్లో 53 పరుగులతో దూకుడుగా ఆడాడు.. దీంతో నిర్ణీత 50 ఓవర్లు ముగిసేసరికి ముంబై 8 వికెట్ల నష్టానికి 444 పరుగులు చేసింది.