గ్రామ పంచాయతీ ఎన్నికలలో తమ సర్పంచ్ అభ్యర్థికి మద్దతు తెలపలేదనే ఉద్దేశంతో ఓ వ్యక్తిని కత్తితో పొడిచిన సంఘటన వికారాబాద్ జిల్లా, పూడూరు మండలం, చన్‌గోములు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ భరత్‌కుమార్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… మంగళవారం రాత్రి మండల పరిధిలోని కండపల్ల్లి స్టేజీ సమీపంలో ఉన్న చాయ్ బంక్ కేఫ్ దగ్గర ఎండి మోహీన్, అతని అన్న ఎండి. హకీం ఉండగా గ్రామానికి చెందిన నాంచేరి శంకర్ అనే వ్యక్తి సమయంలో అక్కడికి వచ్చి కౌంటర్ వద్ద ఉన్న హకీంను బయటికి పిలిచి కత్తితో దాడి చేశాడు. దీంతో హకీంకు ఛాతీపై బలమైన గాయాలు తగిలాయి. వెంటనే నిందితుడు అక్కడి నుండి పరారయ్యాడు. క్షతగాత్రుడిని వెంటనే అక్కడ ఉన్న పలువురు చికిత్స నిమిత్తం వికారాబాద్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం నగరానికి రిఫర్ చేశారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గ్రామానికి చెందిన శ్రీనివాస్ చింతకింది శివలీలకు మద్దతుగా సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డాడు. ఈ ఎన్నికలలో హాకీం మద్దతు ఇవ్వనందుకే ఓడిపోయారనే ఉద్దేశంతో కోపం తెచ్చుకుని హకీంను చంపాలనే కక్షగట్టి కండ్లపల్లికి చెందిన శ్రీనివాస్, కంకంటి రాజు, నాంచేరి రమేష్, ఉప్పరి శేఖర్, పాశం మల్లయ్య, ఆలూరి అనిల్‌కుమార్, పరిగి వెంకటేష్, కిష్టాపూరం బుగ్గరాములు, మేకల నర్సన్న శంకర్‌ని ప్రొత్సహించి హకీంను చంపాలని ప్రయత్నం చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ వారిపై కేసు నమోదు చేసుకుని నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నగరంలోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హకీంను పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి, స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి పరామర్శించారు. అతని ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న ఎమ్మెల్యే మెరుగైన వైద్యం అందివ్వాలని వైద్యులకు సూచించారు.