అమ్మాయి రక్షణ గురించి చర్చ వచ్చిన ప్రతిసారీ, బాధ్యులను బోనులో నిలబెట్టాల్సింది పోయి బాధితురాలి రంగు, శరీరం, ఆమె ధరించిన దుస్తుల గురించి ప్రస్తావించడం ఒక అనాగరిక సంప్రదాయంగా మారిపోయింది. ‘అమ్మాయి సురక్షితంగా ఉండాలంటే పద్ధతిగా ఉండాలి’ అని సుద్దులు చెప్పే మేధావుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అసలు రక్షణకు, దుస్తులకు ముడిపెట్టే ఈ కుసంస్కృతి ఇంకెంత కాలం కొనసాగుతుందనేది నేడు సమాజం ముందున్న అతిపెద్ద ప్రశ్న. వ్యక్తుల ప్రవర్తనను ప్రశ్నించకుండా, బాధితుల వేషధారణను విమర్శించడం అంటే పరోక్షంగా నేరాన్ని సమర్థించడమే అవుతుంది. ప్రజల ఆలోచనలను ప్రభావితం చేసే అత్యంత శక్తివంతమైన సినీ రంగం నేడు మహిళల పట్ల ప్రదర్శిస్తున్న వైఖరి అత్యంత ఆందోళనకరం. ఒకప్పుడు మహిళా పాత్రలను ఎంతో గౌరవప్రదంగా, స్ఫూర్తిదాయకంగా చిత్రించిన వినోద రంగం, రానురాను వారిని కేవలం గ్లామర్ వస్తువులుగా మార్చేసింది.
హీరో అమ్మాయిల వెంట పడితేనే అభిమానులకు సంతోషమని, అది మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ అని బహిరంగంగా వాక్రుచ్చిన పెద్దలు ఈ పరిశ్రమలో ఉండటం విచారకరం. మహిళల గురించి అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడే సీనియర్ నటులు, వారి మాటలకు పగలబడి నవ్వుతూ చప్పట్లు కొట్టే యువతరం నటులు.. వెరసి వెండితెరపై స్త్రీ గౌరవం వేలంపాటగా మారుతోంది. సినిమాలు, టీవీలు లేదా సోషల్ మీడియా- మాధ్యమం ఏదైనా కానీ- సన్నివేశాలు, పాటలు, డ్యాన్సుల పేరుతో మహిళా పాత్రలను కించపరచడం ఒక పరిపాటిగా మారింది. వినోదం పేరుతో నలుగురిలో మహిళలను అవమానించే సంభాషణలు రాసి, వాటిని ‘కామెడీ’ అని ముద్ర వేస్తున్నారు. మరి కొందరైతే కేవలం పాపులారిటీ కోసం అమ్మాయిలపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు.
సమాజంపై బాధ్యత ఉండాల్సిన కళాకారులు, నిర్మాతలు సైతం వ్యాపార సూత్రాలకోసం మహిళల ఆత్మగౌరవాన్ని పణంగా పెడుతున్నారు. ఇప్పుడు తాజాగా ‘సురక్షితంగా ఉండాలంటే దుస్తులు పద్ధతిగా ఉండాలి’ అంటూ హేయమైన పదజాలంతో నీతులు చెప్పేవారు రావడం మన సామాజిక దిగజారుడుతనానికి అద్దం పడుతోంది. నిజానికి, సమస్య అమ్మాయి వేసుకునే దుస్తుల్లో లేదు, అది ఎదుటివారి చూసే చూపులో, పెరిగిన పెంపకంలో ఉంది. స్త్రీ అంటే గౌరవించాల్సిన వ్యక్తి అని కాకుండా, తను కేవలం ఒక ‘వస్తువు’ మాత్రమే అనే భావనను నేటి వినోద మాధ్యమాలు యువతలో బలంగా నాటుతున్నాయి. అందుకే బహిరంగ వేదికలపై అసభ్య వ్యాఖ్యలు వినిపిస్తున్నప్పుడు ఎవరూ అభ్యంతరం చెప్పకపోగా, వాటిని ఆస్వాదించే స్థితికి సమాజం చేరుకుంది. ఇప్పటికైనా సెన్సార్ బోర్డులు, సినీ పెద్దలు ఈ బాధ్యతా రాహిత్యాన్ని అరికట్టాలి.
స్త్రీని కేవలం అందచందాల ప్రదర్శనగా కాకుండా, ఒక మనిషిగా గుర్తించే సంస్కృతిని తెరపై చూపించాలి. ఇకనైనా మహిళల స్వేచ్ఛను దుస్తుల కొలతలతో కొలవడం ఆపాలి. ఆమెకు రక్షణగా ఉండటం అంటే హద్దులు విధించడం కాదు, ఆమె స్వేచ్ఛగా తిరగగలిగే వాతావరణాన్ని సృష్టించడం. ఏ దుస్తులు వేసుకోవాలో నిర్ణయించుకునే హక్కు ఆమెది, కానీ ఆమెను గౌరవంగా చూడాల్సిన బాధ్యత సమాజానిది. ఆలోచనా విధానంలో మార్పు రానంత కాలం, ఎన్ని చట్టాలు తెచ్చినా, ఎంతమంది సుద్దులు చెప్పినా మహిళలపట్ల వివక్ష కొనసాగుతూనే ఉంటుంది. ఈ అవాకులు చెవాకులకు ఫుల్‌స్టాప్ పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది.
దిడ్డి శ్రీకాంత్
86868 65759