రాజస్థాన్‌లో 150 కిలోల పేలుడు స్వభావపు అమోనియం నైట్రేట్‌ను, పేలుడు తూటాలను పోలీసలు బుధవారం స్వాధీనపర్చుకున్నారు. కొత్త సంవత్సరం ఆరంభం నేపధ్యంలో టాంక్ ప్రాంతంలో ఈ బారీ పేలుడు పదార్థాల స్వాధీనం సంచలనం భయాందోళనలకు దారితీసింది. భద్రతా బలగాలు తమకు అందిన కీలక రహస్య సమాచారం మేరకు జరిపిన తనిఖీలల క్రమంలో ఇక్కడ మారుతీ క్లాజ్ కారు డిక్కీలో ఈ పేలుడు పదార్థాలను పట్టుకున్నారు. వీటిని వెంటనే పరీక్షలకు పంపించారు. అనుమానాస్పద కారును పోలీసులు మార్గమధ్యంలో నిలిపివేసి పూర్తిగా సోదాలకు దిగారు. ఈ క్రమంలోనే యూరియా బస్తాల మధ్యన వీటిని వేరుగా బస్తాలలో నింపి ఉంచినట్లు గుర్తించారు. వీటి మధ్యనే పేలుడుకు వినియోగించే 1100 మీటర్ల మేర సెఫ్టీ ఫ్యూజ్ వైర్‌ను కూడా కనుగొన్నారు. ఈ కారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లుతున్నదీ? ఇది ఎవరిది ? అనేది ఆరా తీస్తున్నారు. టాంక్ జైపూర్ జాతీయ రహదారి 52పై బరౌనీ పోలీసు స్టేషన్ వద్ద ఈ లగ్జరీ కారును నిలిపివేసి చూడగా ఇందులో నిషేధిత పదార్థాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రాంతంలో అవాంఛనీయ సంఘటనల నివారణకు నిర్వహించిన రోడ్ల దిగ్బంధం క్రమంలో పేలుడు పదార్థాలు బయటపడ్డాయి. బుందీ నుంచి టాంక్కు ఈ సంచీలను అజ్ఞాత వ్యక్తులు తరలిస్తున్నట్లు వెల్లడైంది. 150 కిలోల అమ్మోనియం నైట్రేట్‌తో పాటు అత్యంత ప్రమాదకర తూటాలు 200 వరకూ కనుగొన్నారు. రికవరి దశలో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. సురేంద్ర పట్వా, సురేంద్ర మోచీగా వీరిని గుర్తించారు వీరు బుండీ జిల్లాలోని కార్వార్ ప్రాంతం వారని వెల్లడైంది. తీవ్రస్థాయి పేలుడు పదార్థం కావడంతో , వీటిని ఉగ్రవాద చర్యలకు వాడేందుకు కుట్ర పన్నారా? అనే విషయం ఇప్పుడు దర్యాప్తు క్రమంలో తేలనుంది.