ప్రజాస్వామ్యం అంటే కేవలం ఎన్నికలు గెలవడం కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పొలిటికల్ లీడర్ల మాటల సంస్కృతి, భాషలో బాధ్యత, విమర్శలో హద్దులను ఎప్పటికప్పుడు గుర్తుంచుకోవాలి. రాష్ట్రంలో ఇటీవలి కాలంలో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి భాష, ప్రతిపక్షంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి భాష రెండింట్లోనూ ప్రజాస్వామ్యానికి తగినస్థాయి కనిపించడం లేదన్న విమర్శ రోజురోజుకు బలపడుతోంది. వీరికి రాజకీయ విమర్శలు కాకుండా వ్యక్తిగత అంశాలమీద మాట్లాడడం అలవాటు అయింది. ఇది రాజకీయ భాష ప్రజల మనసులపై చూపే ప్రభావం గురించి చర్చ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎవరైనా సరే అధికారంలో ఉన్నవారి మాట మరింత బాధ్యత గా ఉండాలి. ముఖ్యమంత్రి మాట అనేది వ్యక్తిగత వ్యాఖ్య కాదు. దీనిని రాష్ట్ర స్వరంగా భావించాలి.
ప్రభుత్వ దృక్పథం అయితే ఇటీవల కొన్ని సందర్భాల్లో అధికార పక్షం నుంచి వచ్చే తీవ్రమైన వ్యక్తిగత విమర్శలు అందరూ గమనిస్తూనే ఉన్నారు. ప్రతిపక్షాన్ని పూర్తిగా తక్కువ చేసే వ్యాఖ్యలు ప్రతి బహిరంగ సభలో చూస్తున్నాము.. కోపం, ఆగ్రహంతో నిండిన పదజాలం ప్రజాస్వామ్యానికి శక్తినిచ్చే భాష కాదు, విద్వేషాన్ని పెంచే భాషగా మారుతున్నాయనే ఆందోళన కలుగుతుంది. అధికారంలో ఉన్న పాలకుల భాష సమస్యల పరిష్కారంపై ఉండాలి తప్ప విద్వేష పూరితంగా ఉండొద్దు. ప్రజలకు ధైర్యం ఇచ్చేదిగా ఉండాలి భవిష్యత్తుపై నమ్మకం కలిగించాలి. కానీ ప్రతిసారీ మాటలు రాజకీయ ప్రత్యర్థుల చుట్టూ తిరుగుతుంటే, పాలనపై చర్చ ఎక్కడ జరుగుతుందనేది మేధావుల ప్రశ్న? ప్రతిపక్షంలో ఉన్నవారి మాట హుందాతనం ఎంతో అవసరం, మాజీ ముఖ్యమంత్రి భాషకు కూడా ఒక ప్రత్యేకమైన బాధ్యత ఉండాలి. ఎందుకంటే ఆయన మాటలు సొసైటీ మీద ప్రభావం చూపుతాయి. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తానే నమ్మకం ప్రజల్లో విశ్వాసం పొందే విధంగా వ్యవహరించినపుడే మళ్ళీ అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుందన్న విషయం మర్చిపోకూడదు. ఇటీవలి కాలంలో ప్రతిపక్ష నేతల భాషపూర్తిగా తిరస్కరణ ధోరణిలో మేం తప్ప ఎవరూ కాదు అన్న అహంకార పూరితంగా ప్రజల సమస్యల కన్నా రాజకీయ కక్షపై కేంద్రీకృతమైందన్న విమర్శను ఎదుర్కొంటోంది. ప్రతిపక్షం పని ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, ప్రజా సమస్యలను ఎత్తిచూపడం, ప్రత్యామ్నాయ దారి చూపడం పై దృష్టి సారించాలి తప్ప, కేవలం వ్యంగ్యం, అవహేళన, ఎద్దేవాగా మారితే ప్రజలకు దిక్సూచి దొరకదు. భాష మారితేనే రాజకీయ సంస్కృతి మారుతుంది, తెలంగాణలో సమస్యలు లేవా? రైతు ఆదాయం, యువత ఉద్యోగాలు, సాగునీరు, ఆరోగ్యం, విద్య అంశాలపై పెద్ద ఎత్తున చర్చ జరిగిందని అందరూ సంతోషించాల్సింది పోయి అందుకు భిన్నంగా ఎవరు ఏమన్నారో, ఎవరు ఎవరిని ఎలా దూషించారో అన్నదే ప్రధాన అంశంగా మారింది. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతం అనేది పాలకులు గమనించాలి. సమాజానికి కావాల్సింది ఏమిటి? తెలంగాణ ప్రజలకు కావాల్సింది ఏమిటని ఆలోచించకపోవడం విచారకరం.
ఘర్షణ భాష కాదు, గెలుపు మాటలు కాదు, కక్ష రాజకీయాలు కాదు కదా… సమస్యలపై మాట్లాడే నాయకత్వం విమర్శలో మర్యాద, అధికారంలో సంయమనం, ప్రతిపక్షంలో హుందాతనం ఉండాలి. ముఖ్యమంత్రి మాట భవిష్యత్తుకు బాటగా ఉండాలి. మాజీ ముఖ్యమంత్రి మాట అనుభవంతో సరియైన మార్గం చూపాలి. ప్రజాస్వామ్యం ఉన్న తెలంగాణలో మాటల వల్ల ప్రజాస్వామ్యం బలహీనపడకూడదు. నాయకుల భాష దిగజారితే, రాజకీయ చర్చ దిగజారుతుంది. రాజకీయ చర్చ దిగజారితే, సమాజం దారి తప్పుతుంది.
ఈ రాష్ట్రానికి ఇప్పుడు కావాల్సింది: ఎత్తైన స్వరం కాదు. లోతైన ఆలోచన. తీవ్రమైన మాటలు కాదు, దూరదృష్టి. ప్రజలు వినాలనుకుంటున్నది తిట్లు కాదు, ప్రజాపయోగకర అంశాలపై చర్చ.. యువత చూపు తెలంగాణ రాజకీయ భాష వైపు.. మాటలు మారితేనే మన రేపటి రాజకీయాలు మారతాయి.
ఈ తరం యువత రాజకీయాల్ని కేవలం సభలలో కాదు, సోషల్ మీడియాలో, కాలేజీ క్యాంపస్‌లో, ఉద్యోగ ఇంటర్వ్యూలలో, కుటుంబ చర్చల్లో చూస్తోంది. అక్కడే ఒక ప్రశ్న పదే పదే వినిపిస్తోంది. ఇది ప్రజాస్వామ్యమా లేక మాటల యుద్ధమా అని, అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి మాటలు ప్రతిపక్షంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి మాటలు రెండింటినీ యువత గమనిస్తోంది. ఇలాంటి భాష యువత ఆశలపై నిరాశలకు దారి తీస్తుంది, యువత ఏమి కోరుకుంటుంది అన్న విషయంపై అవగాహన నాయకులకు లేదేమోనన్న భావన కల్పిస్తుంది. ఉద్యోగాలపై స్పష్టత కోసం యువతే ఎదురుచూస్తోంది. విద్య నైపుణ్యాలపై, పెట్టుబడి పాలనలో పారదర్శకత మాట్లాడేటప్పుడు నిజాయితీ ఉండాలి. కానీ ఇవన్నీ వినిపించాల్సిన చోట ఎవరు, ఎవరిని, ఎలా విమర్శించారన్నదే హెడ్‌లైన్ అవుతోంది. ఇదే అంశాలపైన యువత ప్రశ్నిస్తోంది.
మాకేం లాభం, మా భవిష్యత్తు ఈ మాటలవల్ల ప్రయోజనం ఏముందన్న భావనకు పుల్ స్టాప్ పెట్టాలి కదా. ముఖ్యమంత్రి మాటలు యువతకు ప్రేరణ కావాలి. ముఖ్యమంత్రి భాష యువతకు రోల్ మోడల్‌గా నిలువాలి, ఆశ నింపాలి, దిశ చూపాలి, అవకాశాలపై నమ్మకం కలిగించాలి. ఈ ఏడాది ఎన్ని ఉద్యోగాలు లభిస్తాయి. ఎలాంటి స్కిల్స్‌కు డిమాండ్ ఉంటుంది. స్టార్టప్‌లకు ఏమి మద్దతు ఉండాలని యువత కోరుకుంటన్నది.. అన్న విషయాలు ఆలోచించకపోతే తప్పకుండా వారిలో నిరాశ నిస్సృహాలు చోటు చేసుకుంటాయి. మాటల యుద్ధాలు కాదు ఆపర్చునిటీ మ్యాప్ కావాలని ఆశిస్తున్నది నేటి యువత.. మాజీ ముఖ్యమంత్రి మాటలను కూడా యువత ఆలోచిస్తున్నది.. వారి అనుభవం సరియైన దారి చూపాలి. యువతకు గత అనుభవం, తప్పులు ఏవో చెబితేనే కాదు ముందుకు ఎలా పోవాలో కూడా దారిచూపాలి, ప్రతి విషయాన్ని తిరస్కరించే ధోరణి యువతను అలసటకు గురిచేస్తోంది. యువత అడుగుతోంది మీ ప్రత్యామ్నాయం ఏమిటి? విమర్శతోపాటు విజన్ కావాలని యువత కోరుకుంటుంది. అందుకే నాయకుల భాష హద్దులు దాటితే వెంటనే వ్యతిరేకతకు అది వారిపట్ల వ్యతిరేకతకు అంకురమవుతుంది.
రాజకీయ శబ్దం పెరిగితే పాలసీ చర్చలు తగ్గుతాయి. పెట్టుబడులపై అనిశ్చితి పెరుగుతుంది. ఉద్యోగ అవకాశాలు ఆలస్యం అవుతాయి. యువత కోరుకునే కొత్త రాజకీయ భాష యువత స్పష్టంగా చెబుతోంది. అధికారంలో ఉన్న పాలకులు డేటాతో మాట్లాడండి. డెడ్‌లైన్లు చెప్పండి. ఫలితాలు చూపండి. ప్రతిపక్షంలో ఉన్నవారుప్రత్యామ్నాయాలు చూపండి. యువత ఉపాధిపై స్పష్టత ఇవ్వండి. విమర్శలో హుందాతనం పాటించండి. అధికారం లో ఉన్నా వారు, ప్రతిపక్షంలో ఉన్నవారు గౌరవం లేని మాటలు మాట్లాడితే విశ్వసనీయతను కోల్పోవడం ఖాయం. ఇక చివరి మాట మాటలు తగ్గించండి, మార్గాలు చూపండి అని యువగళం హెచ్చరిస్తున్నది. తస్మాత్ జాగ్రత్త.
జి మధు గౌడ్ (జర్నలిస్ట్)
94933 20002