న్యూఢిల్లీ ః దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల సమ్మె జరిగింది. ప్రభావం పెద్దగా కన్పించలేదు. ఇ కామ్, ఫుడ్ పంపిణీ వంటి కార్యకలపాలకు ఇబ్బంది ఏర్పడలేదు. మంచి వేతనం , పని పరిస్థితులు కోరుతూ గిగ్ వర్కర్లు బుధవారం తమ సేవలను నిలిపివేశారు. నూతన సంవత్సర వేడుక నేపథ్యంలో యధావిధిగా , అంతకు ముందటికి మించి జొమాటో, స్విగ్గి ఇతర సంస్థల ద్వారా పంపిణీలు సాగాయి. కొన్ని ప్రాంతాలలో సమ్మె లో భాగంగా జొమాటో, స్విగ్గీ ఇతర సంస్థల కార్యాలయాల ఎదుట వర్కర్లు నిరసనలకు దిగారు. తమ ఆందోళనను ఉధృతం చేస్తామని తెలంగాణ గిగ్ , ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్ ( టిజిపిడబ్లుయు) , జాతీయ స్థాయి ఐఫాట్ యూనియన్లు హెచ్చరించాయి. తమకు సముచిత వేతనాలు, కమిషన్లు అవసరం అని లేకపోతే లక్షలాది మంది నిరసనకు దిగుతామని ప్రకటించారు.
బుధవారం సమ్మెదశలో ఫుడ్ కంపెనీలు డెలివరీ ఏజెంట్లకు భారీ స్థాయిలో ఆఫర్లు ప్రకటించాయి. దీనితో అనేక ప్రాంతాలలో న్యూ ఇయర్ ఫుడ్ ఆర్డర్లు ఇంతకు ముందటి కన్నా ఎక్కువగా జరిగాయని జోమాటో ఇతర సంస్థలు తెలిపాయి. అయితే పలువురు కార్మికులు సమ్మెలో పాల్గొన్నారని , విధులకు దూరంగా ఉన్నారని కార్మికుల సంఘాలు తెలిపాయి. న్యూ ఇయర్ సందర్భంగా ఒక్కరోజే అధిక పే ఔట్స్, ఆర్డర్ కాన్సిల్ కోతలు లేకుండా చూసుకుంటామనే ఆఫర్లతో పంపిణీకి ఇబ్బంది ఏర్పడలేదని వెల్లడైంది.