మన తెలంగాణ/హైదరాబాద్: రోడ్లపై చెత్త, గుంతలు కనపడొద్దని సిఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నగరంలో చెత్త నిర్వహణ ఇబ్బందికరమైన సమస్య అని, ఈ సమస్యపై జో నల్ కమిషనర్లు తమ పరిధిలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. చెత్త నిర్వహణతో పాటు జోన్ల వారీగా ప్రజల స మస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత జోనల్ కమిషనర్లదేనని ఆ యన పేర్కొన్నారు. జోనల్ కమిషనర్లు ప్రతిరోజూ క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. నగరాన్ని వివిధ జోన్లుగా పునర్వ్యవస్థీకరించిన నేపథ్యంలో కొత్తగా నియమితులైన జోనల్ కమిషనర్‌లతో ముఖ్యమంత్రి ఇంటిగ్రెటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జోనల్ కమిషనర్లకు సిఎం దిశానిర్దేశం చేశారు. ఈ సం దర్భంగా సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ నగరంలో ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేదించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని, దశల వారీగా ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించాలని, చెరువులు, నాలాలు, చెత్త డంపింగ్ ఏరియాల వద్ద సిసి కెమెరాలను ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు. చెరువులు, నాలాలను ఆక్రమణల నుంచి నగరాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, ఎక్కడా చెత్త కనిపించడానికి వీళ్లేదని ఆయన సూచించారు.
నెలకు మూడు రోజులు శానిటేషన్‌పై స్పెషల్ డ్రైవ్
ఔటర్ రింగ్‌రోడ్డు లోపల ఉన్న కోర్- అర్బన్ రీజయన్ ఎకానమీ ఏరియాలో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి సాధించాలన్న లక్ష్యంతో నగరాన్ని 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులుగా పునర్వ్యవస్థీకరించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. కోర్-అర్బన్ రీజియన్‌ను మొత్తంగా ప్రక్షాళన చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా వచ్చే ఐదేళ్లకు అవసరమైన కార్యాచరణ రూపొందించుకోవాలని హైదరాబాద్ నగర జోనల్ కమిషనర్లను సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. రాష్ట్రం మొత్తం ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసుకోవాలనే తెలంగాణ రైజింగ్ – 2047 విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేసుకున్నామని, హైదరాబాద్ పరిపాలన పట్టాలెక్కించాలన్నదే తమ ప్రభుత్వ ఆలోచన అని ఆయన తెలిపారు. ప్రధానంగా నెలకు మూడు రోజులు శానిటేషన్‌పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. రోడ్లపై ఎక్కడా చెత్త కనిపించడానికి వీల్లేదని, అలాగే రోడ్లపై గుంతలు కనిపించొద్దని, ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకోవాలిలని సిఎం అధికారులకు సూచించారు. ప్రతి పది రోజులకోసారి గార్బేజ్ క్లియరెన్స్ డ్రైవ్ నిర్వహించాలని, ఎక్కడ సమస్య తలెత్తినా పరిష్కరించేందుకు టోల్ ఫ్రీ నంబర్‌కు వచ్చే ఫిర్యాదులపై వీలైనంత తొందరగా స్పందించాలని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. దోమల నివారణ, అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలన్నారు. కోర్-అర్బన్ ఏరియాలో డీజిల్ బస్సులు, ఆటోల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలు తీసుకురావాలని నిర్ణయించామని, నగరంలో కాలుష్య నియంత్రణకు అవసరమైన పూర్తిస్థాయి ప్రక్షాళన తీసుకుంటున్నామని సిఎం రేవంత్ తెలిపారు.
నాలాల పూడికతీత పనులు జనవరి నుంచి
ప్రజలకు ముఖ్యంగా జనన మరణ ధ్రువీకరణ, ట్రేడ్ లైసెన్సులు, ఇతర ధ్రువ పత్రాల జారీ విషయంలో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా, ఇబ్బందులు కలగకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆన్‌లైన్ సేవల ద్వారా ప్రజలకు పారదర్శక సేవలు అందించాలిలన్నారు. కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్, అపార్ట్‌మెంట్ అసోసియేషన్లతో అనుసంధానం ఉండేలా కమ్యూనికేషన్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. గుడ్ గవర్నెన్స్ నుంచి స్మార్ట్ గవర్నెన్స్‌కు మారాలన్నారు. హైడ్రా, జీహెచ్‌ఎంసీ, వాటర్ వర్స్ విభాగాలు నాలాల పూడిక తీత పనులు జనవరి నుంచి మొదలు పెట్టాలని సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. నగరంలో వీధిదీపాలు సరిపడా ఉండేలా చూసుకోవాలని, కోర్ అర్బన్ ఏరియాలో ఆయా విభాగాల అధికారులను సమన్వయం చేసే బాధ్యత స్పెషల్ సిఎస్ చూసుకుంటారని, అందరూ కలిసి పనిచేస్తేనే నగర భవిష్యత్ బాగుంటుందని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.
ప్రతి నెలా ఒకసారి జోనల్ కమిషనర్లతో సమీక్ష
ప్రతి నెలకు ఒకసారి జోనల్ కమిషనర్లతో సమీక్ష చేస్తానని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని హోటల్స్ లో ఫుడ్ సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. క్యూర్ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలకు అందుబాటులో ఉన్న స్థలాన్ని కేటాయించి భవనాలు నిర్మించాలన్నారు. అద్దె భవనాల నుంచి సొంత భవనాలకు కార్యాలయాలను తరలించాలని అధికారులను సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. క్యూర్ పరిధిలోని 12 జోన్లలో చెరువులు, కుంటలు, నాలాలను పూర్తిగా మ్యాపింగ్ చేయాలని ఆయన సూచించారు. ఆక్రమణలను తొలగించి వర్షాకాలంలో వరదలతో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పెద్ద చెరువులను గుర్తించి వాటిని పునరుద్దరించి యాక్టివిటీ జోన్స్ గా అభివృద్ధి చేయాలని ఆయన సూచించారు. జనవరి నుంచి ప్రతి ఒక్కరూ ఫీల్డ్‌లో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో సిఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, స్పెషల్ సిఎస్ జయేశ్ రంజన్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, సెక్రటరీ మాణిక్ రాజ్, జీహెచ్‌ఎంసీ కర్ణన్, హెచ్‌ఎండబ్ల్యూఎస్ ఎండి అశోక్ రెడ్డి, హెచ్‌ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, ఎఫ్‌సి డిఏ కమిషనర్ శశాంక, హైడ్రా కమిషనర్ రంగనాథ్, జోనల్ కమిషనర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.