సినిమాల పైరసీ కేసులో అరెస్టైన ఐబొమ్మ రవి కస్టడీ రిపోర్టును పోలీసులు బుధవారం నాంపల్లి కోర్టుకు సమర్పించారు. ఐ బొమ్మ, బప్పం పేరుతో వెబ్‌సైట్లను ఏర్పాటు చేసిన రవి వాటిలో సినిమాలను అప్‌లోడ్ చేసేందుకు వివిధ రకాలుగా కొనుగోలు చేసేవాడు. దీనిలో భాగంగా రెండు రకాలుగా సినిమా ప్రింట్‌ను రవి కొనుగోలు చేశారు. నార్మల్ ప్రింట్‌కు 100 డాలర్లు, హెచ్‌డీ ప్రింట్‌కు 200 డాలర్లు చెల్లించాడు. తన వెబ్‌సైట్లలో బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయగా వచ్చిన డబ్బులను ఏడు ఖాతాలను పోలీసులు గుర్తించారు. ఏడు ఖాతాలకు వివిధ మార్గాల ద్వారా రూ.13.40 కోట్ల నగదు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. బెట్టింగ్ యాడ్‌ల ద్వారా రూ.1.78 కోట్లు కూడబెట్టినట్లు గుర్తించారు. ఐబొమ్మ రవి సోదరి చంద్రికకు రూ. 90 లక్షల నగదు పంపినట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఇలా వచ్చిన డబ్బుల్లో ఎక్కువ మొత్తం రూ.10కోట్లు వివిధ దేశాల్లో జల్సాలు
చేసేందుకు విచ్చలవిడిగా ఖర్చు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. నగదు లావాదేవీలన్నీ ఐ బొమ్మ రవి డాలర్ల రూపంలోనే చేసినట్లు గుర్తించారు. రాకేష్ అనే వ్యక్తి ద్వారా ట్రైడ్ మార్క్ లైసెన్స్, బెట్టింగ్, పైరసీ ద్వారా వచ్చిన నగదుతో రవి జల్సాలు చేసినట్లు పోలీసులు కనుగొన్నారు. హైదరాబాద్ కూకట్‌పల్లిలోనే రవి ఆఫీస్ నడిపినట్లు కస్టడీ రిపోర్టులో పోలీసులు స్పష్టం చేశారు. దాదాపు 12 రోజుల కస్టడీ అనంతరం మంగళవారం అతడిని జైలుకు పోలీసులు తరలించారు. పోలీసుల కస్టడీలో ఐ బొమ్మ రవి కీలక అంశాలు వెల్లడించారు. వాటిని తమ కస్టడీ రిపోర్టులో పొందుపరిచిన అంశాలను కోర్టుకు పోలీసులు అందజేశారు. హైఫై పబ్‌లు, ఫైవ్ స్టార్ హోటళ్లలోనే బస చేయడం ద్వారా లగ్జరీ లైఫ్ ఎంజాయి చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడించారు. ప్రస్తుతం రవి అకౌంట్‌లో రూ. 3 కోట్ల నగదును పోలీసులు ఫ్రీజ్ చేసిన సంగతి తెలిసిందే.