దోహా వేదికగా జరిగిన ఫిడే వరల్డ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించి చరిత్ర సృష్టించిన తెలంగాణ కుర్రాడు అర్జున్ ఇరిగేశిని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బుధవారం అభినందించారు. అర్జున్ విజయం దేశ యువతకు స్ఫూర్తిగా పనిచేస్తుందన్నారు. ప్రపంచ చెస్‌లో భారత్ హవా నడుస్తుందన్నారు. దీనికి ప్రపంచ చెస్‌లో దేశ క్రీడాకారులు సాధిస్తున్న పతకాలే నిదర్శనమన్నారు. బ్లెట్జ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో రెండు పతకాలు సాధించి అర్జున్ భారత ఖ్యాతిని ఇనుమడింప చేశాడని ప్రశంసించారు. అతడి నైపుణ్యాలు, ఓర్పు, అభిరుచి, విజయాలు యువతకు స్ఫూర్తిగా నిలుస్తాయనడంలో సందేహం లేదని ప్రధాని మంత్రి పేర్కొన్నారు.