మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర శాసనమండ లి, శాసనసభ సమావేశాలు వారం రోజుల పాటు జరగనున్నాయి. సోమవారం అసెంబ్లీ, కౌన్సిల్ స మావేశాలు ముగిసిన అనంతరం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన శాసనసభా వ్య వహారాల సలహా సంఘం (బిఎసి) సమావేశమైం ది. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు, బిజె పి శాసనసభాపక్షం నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, మజ్లీస్ శాసనసభాపక్షం నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ, సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అసెంబ్లీ కార్యదర్శి రేండ్ల తిరుపతిరావు, కౌ న్సిల్ కార్యదర్శి నరసింహాచార్యులు పాల్గొన్నారు. సుమారు గంట పాటు జరిగిన సమావేశంలో అనే క అంశాలపై వారు చర్చించారు. తొలుత సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలన్న అంశంపై చర్చ జరిగింది. అయితే సమావేశాలను కనీసం ఇ రవై రోజులు నిర్వహించాలని హరీశ్‌రావు, ఏలేటి మహేశ్వర్ రెడ్డి పట్టుబట్టారు.
రెండు, మూడు రోజుల్లోనే సమావేశాలను ముగించుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు మీడియా కథనాలు వస్తున్నాయన్నారు. హరీష్ రావు మాట్లాడుతూ తాము అధికారంలో ఉన్నప్పుడు (తొలి ఏడాది) 36 రోజులు సమావేశాలు నిర్వహించామని, మీరు ఈ ఏడాది కేవలం 16 రోజులే నిర్వహించారని అన్నారు. అక్బరుద్దీన్ ఒవైసీ కల్పించుకుని గత ప్రభుత్వం చేసిన తప్పిదాలనే మీరూ చేయకండి అని సూచించారు. ఈ దశలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ మంగళవారం వైకుంఠ ఏకాదశి కారణంగా సెలవు తీసుకుందామని, ఆ తర్వాత ఈ ఏడాది చివర, ఆ మర్నాడు నూతన సంవత్సరం కోలాహలం ఉంటుంది కాబట్టి మళ్లీ జనవరి 2, 3 తేదీల్లో సమావేశమవుదామన్నారు. స్పీకర్ కల్పించుకుని ౩వ తేదీన మరోసారి బిఎసి నిర్వహించుకుందామని చెప్పారు.
పవర్ పాయింట్ ప్రజంటేషన్‌కు బిఆర్‌ఎస్ పట్టు
ఇదిలాఉండగా సభ (అసెంబ్లీ)లో నీటి పారుదల ప్రాజెక్టుల అంశంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్‌కు తమకు అవకాశం ఇవ్వాల్సిందిగా టి. హరీష్ రావు కోరారు. అందుకు శ్రీధర్ బాబు స్పందిస్తూ మీరు అధికారంలో ఉన్నప్పుడు తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండానే పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారని, తమకూ అవకాశం ఇవ్వమంటే ఇవ్వలేదని, అందుకే సభ నుంచి వాకౌట్ చేశామని గుర్తు చేశారు. మంత్రి వ్యాఖ్యలకు హరీష్ రావు స్పందిస్తూ అంటే ఇప్పుడు మమ్మల్ని కూడా వాకౌట్ చేయమంటారా?, సభలో తమకూ పవర్ పాయింట్ ప్రజంటేషన్‌కు అవకాశం ఇవ్వాలన్నారు. దీనికి అనుమతించాలని తాము స్పీకర్‌కు ఇదివరకే లేఖ రాశామని ఆయన చెప్పారు. ఈ అంశంపై వచ్చే బిఎసి సమావేశంలో నిర్ణయం తీసుకోవచ్చని స్పీకర్ చెప్పినట్లు సమాచారం. వచ్చే నెల 7వ తేదీ వరకు సమావేశాలు కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది.
కేంద్రాన్ని ఎండగట్టేందుకు ఉపాధి హామీ పథకంపై చర్చ
ఇదిలాఉండగా ఒకవేళ సమావేశాలను పొడిగిస్తే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ (విబి జి రామ్ జి) పథకంపై చర్చించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఈ పథకం పేరును కేంద్రం మార్పు చేయడమే కాకుండా రాష్ట్రాలపై నలభై శాతం వాటా భారం వేయాలనుకుంటున్నందున, ఉభయ సభల్లో కేంద్రాన్ని ఎండగడుతూ తీర్మానం చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది.
కౌన్సిల్‌లో బిఏసి సమావేశం
అనంతరం కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన బిఎసి సమావేశం జరిగింది. డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, కౌన్సిల్‌లో ప్రతిపక్ష నేత మధుసూదనా చారి, కౌన్సిల్ కార్యదర్శి వి. నరసింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు. 3న అసెంబ్లీ బిఎసి సమావేశం ముగిసిన అనంతరం తామూ సమావేశమై తేదీలను, అజెండాను ఖరారు చేద్దామని భావించినట్లు తెలిసింది.