సోయా పంట విక్రయానికి తీసుకువచ్చి మూడు రోజులైనా సిబ్బంది తమను పట్టించుకోవడం లేదని మండిపడుతూ మంగళవారం రైతులు పెద్ద ఎత్తున జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డ్ ప్రధాన గేటు ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. మార్కెట్‌కు రైతులు తీసుకొచ్చిన సోయా పంటను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తాము ఎంతో కష్టపడి పండించిన సోయా పంట ప్రకృతి వైపరీత్యం వల్ల రంగు మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. సొయా కొనుగోలు చేయాలని నిరసన తెలపడం వల్ల అధికారులు షెడ్యూల్ ఇచ్చారని, కానీ మూడు రోజులుగా సోయా కొనుగోలు చేయడం లేదని మండిపడ్డారు. అధికారుల తప్పిదం వల్ల, అధికారుల సరైన ప్రణాళిక లేని కారణంతో కొనుగోళ్లలో ఇబ్బందులు తప్పడం లేదని అన్నారు. కాగా, రైతులు గేటు ఎదుట బైఠాయించడంతో మార్కెట్‌కు తీసుకొచ్చిన పత్తి రైతులు లోనికి వెళ్లేందుకు దారిలేకపోవడంతో రోడ్డుకు ఇరువైపులా భారీ ఎత్తున వాహనాలు నిలిచిపోయి తీవ్ర ట్రాఫిక్‌కు ఇబ్బంది ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు మార్కెట్ యార్డ్‌కు చేరుకొని ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని నచ్చచెప్పినా రైతులు అక్కడే బైఠాయించారు. మార్కెటింగ్ శాఖ ఏడి గజానంద్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కాగా, రైతులను ఉద్దేశించి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చిట్యాల సుహాసినిరెడ్డి మాట్లాడుతూ..రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వాలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు పండించిన ఉత్పత్తులను అమ్ముకోవడానికి అనేక కష్టాలు పడే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.