సుప్రీం ఆదేశాలు.. రాజకీయాలపై ఆగ్రహం
ఢిల్లీ హైకోర్టు తీర్పుపై స్టే …దోషి వివరణకు గడువు
పలు మలుపుల నడుమ 2017 అత్యాచార ఘటన
దోషి బాధితురాలి కూతుళ్ల తీవ్రస్థాయి స్పందనలు
న్యూఢిల్లీ ః ఉన్నావ్ అత్యాచార ఉదంతంలో సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ కీలక ఆదేశాలు వెలువరించింది. ఈ కేసులో దోసి కుల్దీప్ సింగ్ సెంగర్‌ను జైలు నుంచి వెంటనే విడుదల చేయరాదని ఆదేశించింది. ఆయన జీవిత ఖైదు తగ్గిస్తూ ఢిల్లీ హైకోర్టు వెలువరించిన తీర్పుపై స్టే విధించింది. జడ్జిలను లక్షంగా చేసుకుని విమర్శలు వెలువడుతున్న విషయం తాము పరిగణనలోకి తీసుకున్నామని ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వపు సెలవుల ధర్మాసనం వ్యాఖ్యానించింది. న్యాయస్థానం జడ్జిలే నిందితుడిని దోషిగా ఖరారు చేశారనే విషయం గుర్తుంచుకోవాలని తెలిపారు. నిజానికి తాము ఈ జడ్జిలను తమకున్న అత్యుత్తమ జడ్జిలుగా భావిస్తున్నామని చీఫ్ జస్టిస్ బెంచ్ తెలిపింది.
కొందరు రాజకీయ లబ్ధికి యత్నిస్తున్నారని సుప్రీంకోర్టు సోమవారం మందలించింది. ఈ కేసులో దోషి , బిజెపి నుంచి బహిష్కరణకు గురైన నేత కుల్దీప్ సింగ్ సెంగర్ లాయర్ల వాదన తరువాత ఉన్నత న్యాయస్థానం స్పందించింది. జడ్జిలపై విమర్శల ధాటి సరికాదని సిబిఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మోహతా చెప్పారు. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సిబిఐ సవాలు చేసింది. హైకోర్టు ఆయనకు ఉన్నావ్ కేసులో ఉపశమనం కల్గించినా, బాధితురాలి తండ్రి కస్టడీ మరణం కేసులో ఆయనకు పడ్డ పది సంవత్సరాల శిక్ష ఉన్నందున విడుదల కుదరదని సుప్రీంకోర్టు తెలిపింది. ఆయనను విడుదల చేయరాదని పోలీసులకు ఆదేశాలు వెలువరించింది.
ఎనిమిదేండ్లుగా తెగని పోరు..విసిగిపోయాం: కుల్దీప్ సింగ్ కూతురు
ఉన్నావ్ అత్యాచార ఘటనలో దోషి కుల్దీప్ సింగ్ సెంగర్ కూతురు ఇషిత సెంగర్ సోమవారం స్పందించారు.తమ కుటుంబం నానా రకాలుగా వేధింపులకు గురి అవుతోందని, ఎనిమిదేండ్లుగా తాము న్యాయపరంగా సరైన తీర్పు కోసం ఎదురుచూస్తున్నామని బహిరంగ లేఖలో తెలిపారు. ఎప్పటికప్పుడు సముచిత న్యాయం దోబూచులాట సాగుతోందని స్పందించారు. ఈ దేశంలో ఏ కేసు అయినా కేవలం సామూహిక భావోద్వేగాల పరిధిలోనే సాగుతాయా? ఆర్బాటాలకు అనుగుణంగానే అంతా సాగుతుందా? అని ప్రశ్నించారు. ప్రస్తుత పరిణామాల దశలో తమకు ఇక క్రమేపీ ఆశలు సన్నగిల్లుతున్నాయని వ్యాఖ్యానించారు. తండ్రికి జైలుశిక్ష నిలిపివేతపై సుప్రీంకోర్టు స్టే నేపథ్యంలో ఆమె లేఖ వెలువడింది. తాము ఇప్పటికీ రాజ్యాంగం పట్ల విశ్వాసంతో ఉన్నామని చెప్పారు. అయితే దేనికైనా ఓపిక అవసరం కదా అని వ్యాఖ్యానించారు.
సెంగర్‌కు మరణశిక్ష వరకూ పోరు ఆగదు: ఉన్నావ్ బాధితురాలు
ఉన్నావ్ కేసులో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు తీర్పు పట్ల బాధితురాలు స్పందించారు. ఇది మంచి పరిణామమే. తన క్షోభ సంగతి పక్కనపెట్టండి, తన తండ్రి ఆత్మశాంతికి తప్పనిసరిగా దోషికి మరణశిక్షపడాల్సిందే అని ఆమె తెలిపారు. ఢిల్లీలో సుప్రీంకోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడారు. సెంగర్‌కు మరణశిక్ష పడే వరకూ తాను ఊరుకునేది లేదని తెలిపారు. న్యాయం సంపూర్ణంగా ఉండాల్సిందే. సగం సగం న్యాయం అన్యాయం అన్పించుకుంటుందని వ్యాఖ్యానించారు.