హైదరాబాద్: సంక్రాంతి పండుగకు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌కి పెద్ద ఎత్తున ప్రజలు పయనమవుతారు. ఈ క్రమంలో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ నెలకొంటుంది. ఈ నేపథ్యంలో టోల్ గేట్ల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. అయితే ఈసారి సంక్రాంతికి టోల్ గేట్ ఫీజు రద్దు చేయాలని రాష్ట్ర ఆర్ అండ్ బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశారు. జనవరి 9 నుంచి 14 వరకు హైదరాబాద్ నుంచి విజయవాడ మార్గంలో, జనవరి 16 నుంచి 18 వరకు విజయవాడ హైదరాబాద్ రూట్‌లో టోల్ ఫీజు లేకుండా ఉచిత ప్రయాణానికి అనుమతి ఇవ్వాలని కోరారు. సంక్రాంతి పండగ రోజుల్లో 200 శాతం అధికంగా ట్రాఫిక్ రద్దీ ఉంటుందని లేఖలో పేర్కొన్నారు. టోల్ గేట్ల వద్ద వాహనాల రాకపోకలు సజావుగా సాగేందుకు వీలుగా అనుమతించాలని కోరారు.