యునైటెడ్ నేషన్స్ : ప్రపంచ దేశాధినేతలు విధ్వంసానికి కాకుండా అభివృద్ధి కోసం పెట్టుబడులు పెట్టాలని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ తన నూతన సంవత్సర సందేశంలో సూచించారు. ఈమేరకు అరేబిక్, చైనీస్, ఇంగ్లీష్, ఫ్రెంచి,రష్యా, స్పానిష్ తదితర ఆరు అధికారిక భాషలతోపాటు హిందీ, ఉర్దూ భాషలతో కలిపి మొత్తం 11భాషల్లో ఈ సందేశం అందించారు. కొత్త సంవత్సరం లోకి అడుగుపెడుతున్న మనం ప్రస్తుతం గందరగోళం, అనిశ్చితి పరిస్థితుల్లో ఉన్నామని ప్రపంచంలో నాలుగోవంతు జనాభా జీవితాలు సంక్షోభంలో చిక్కుకున్నాయని వివరించారు.
ప్రపంచ వ్యాప్తంగా 200 మిలియన్ మంది కన్నా ఎక్కువ మందికి మానవతా సాయం అవసరమని, దాదాపు 120 మిలియన్ మంది యుద్ధాలు, సంక్షోభం, ప్రకృతి వైపరీత్యాలు, లేదా పీడన నుంచి బలవంతంగా నిర్వాసితులవుతున్నారన్నారు. అయినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా సైనిక దళాల కోసం 2024లో 2.7 ట్రిలియన్ డాలర్ల వరకు ఖర్చు చేయగా, 2035 నాటికి ఈ వ్యయం 6.6 ట్రిలియన్ డాలర్లకు చేరుకునే పరిస్థితి ఏర్పడడం విస్మయం కలిగిస్తోందన్నారు.