టీం ఇండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఈ ఏడాది తన దృష్టిలో ఉత్తమ బౌలర్ ఎవరో చెప్పేశాడు. మ్యాజికల్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి బౌలర్ ఆఫ్ ధి ఇయర్ అని పేర్కొన్నాడు. తన యూట్యూబ్ ఛానల్‌లో ఈ విషయంపై అశ్విన్ విశ్లేషించాడు. ‘‘నా దృష్టిలో వరుణ్ చక్రవర్తి బౌలర్ ఆఫ్ ది ఇయర్. అతడు జట్టుకు ఒక ఎక్స్ ఫ్యాక్టర్. టీం ఇండియా టి-20 వరల్డ్ కప్ 2026 సాధించడంలో అతడు కీలక పాత్ర పోషించబోతున్నాడు. ముఖ్యంగా అతడు టి-20 స్పెషలిస్ట్ బౌలర్’’ అని అశ్విన్ అన్నాడు.
ఇక వరుణ్ ఒకానొక దశలో జట్టుకు దూరమై.. తిరిగి బలంగా కమ్‌బ్యాక్ ఇచ్చిన అంశాన్నీ అశ్విన్ ప్రస్తావించాడు. ‘‘అతడు జట్టులో చోటు కోల్పోయినప్పుడు పుంజుకొని కమ్‌బ్యాక్ ఇచ్చాడు. ప్రస్తుతం అతడు టి-20 బౌలింగ్‌లో నెం.1 ర్యాంకులో ఉన్నాడు. నిజానికి అతడో ఆర్కిటెక్ట్. క్రికెట్ అతడి మొదటి వృత్తి కాదు. వరుణ్ మొదట చెన్నైలో ఐదో డివిజన్‌లో బౌలింగ్ చేశాడు. తర్వాత నెట్ బౌలర్‌గా వచ్చాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో అద్భుతంగా బంతులు సంధీంచాడు’’ అంటూ వరుణ్ క్రికెట్ ప్రయానాన్ని అశ్విన్ గుర్తు చేశాడు.