రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాలు జరుగుతున్న వేళ బిఆర్‌ఎస్ అధినేత, అసెంబ్లీలో బిఆర్‌ఎస్ ఫ్లోర్ లీడర్ కె.చంద్రశేఖర్ రావు పార్టీ ముఖ్య నాయకులను డిప్యూటీ ఫ్లోర్ లీడర్స్, ఉప నేతలు, విప్‌లుగా ప్రకటించారు. అసెంబ్లీలో బిఆర్‌ఎస్ శాసనసభాపక్ష డిప్యుటీ ఫ్లోర్ లీడర్లుగా తన్నీరు హరీశ్ రావు, పటోల్ల సబితా ఇంద్రారెడ్డి,తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కెసిఆర్ నియమించారు. అదేవిధంగా శాసనమండలిలో బిఆర్‌ఎస్ పార్టీ శాసనమండలిపక్ష డిప్యుటీ ఫ్లోర్ లీడర్లుగా ఎల్. రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిలకు బాధ్యతలు అప్పగించారు. శాసనమండలిలో బిఆర్‌ఎస్ పార్టీ విప్‌గా దేశపతి శ్రీనివాస్‌ను ఎంపిక చేశారు. ఈ మేరకు మంగళవారం బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు. డిప్యూటీ ఫ్లోర్ లీడర్స్, విప్‌లు అందరికీ మార్గదర్శకత్వం అందించడం ద్వారా బిఆర్‌ఎస్ అసెంబ్లీలో మరింత ప్రభావవంతంగా వ్యవహరిస్తుందని పార్టీ నేతలు భావిస్తున్నారు.