మన తెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జ లదోపిడీకి పాల్పడుతున్నదని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎం ఎల్‌ఎ హరీష్‌రావు మండిపడ్డారు. ముందుగా గోదావరి బ నకచర్లతో జలదోపిడీకి ప్రయత్నించిన ఎపి, నష్టనివారణ కోసం గోదావరి నల్లమల సాగర్‌కు మార్చుకుందని చెప్పా రు. అది బనకచర్ల అయినా నల్లమలసాగర్ అయినా జరిగే ది తెలంగాణ జల దోపిడి అని పేర్కొన్నారు. నల్లమల సాగర్ అక్రమ నిర్మాణానికి సూత్రధారి చంద్రబాబు అయితే, పాత్రధారి రేవంత్ రెడ్డి అని విమర్శించారు. కత్తి చంద్రబాబుదే అయినా పొడిచేది మాత్రం రేవంత్‌రెడ్డి అని పేర్కొన్నారు. అసెంబ్లీలో చిల్లర ప్రసంగం కాదు, గోదావరి బకనచర్ల ప్రాజెక్ట్‌కు వ్యతిరేకం అని తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.అసెంబ్లీలో తీర్మానం చేస్తే తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. సిడబ్య్లూసి అనుమతి రద్దు చేయాలని ఢిల్లీలో ధర్నా చేద్దామని పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం బిఆర్‌ఎస్ నేతలతో కలిసి హరీష్‌రావు మీడియా సమావేశం నిర్వహించారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో సిఎం రేవంత్‌రెడ్డి తెలంగాణకు ద్రోహం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారా… లేక చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించుకుంటున్నారా..? అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి నోరు తెరిస్తే అబద్దాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. బనకచర్ల విషయంలో కూడా ఎన్నో అబద్ధాలు చెప్పారని, ఆయన మాటలకు, చేతలకు పొంతనే ఉండట్లేదని విమర్శించారు. ఎపి నిర్మిస్తోన్న గోదావరి బనకచర్ల ప్రాజెక్ట్‌కు సిడబ్య్లూసి అనుమతి వచ్చిందని, తెలంగాణ రాష్ట్ర అభిప్రాయం లేకుండా సిడబ్య్లూసి ఎలా అనుమతి ఇస్తోందని నిలదీశారు. గోదావరి బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మిస్తే తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పారు. ఇంత జరుగుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుందని ఆక్షేపించారు.
బనకచర్లపై మేము గట్టిగా పోరాటం చేశాం
గోదావరి- బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుందని తాము గట్టిగా పోరాటం చేశామని హరీష్ రావు అన్నారు. బనకచర్ల విషయంలో నిద్ర లేపాం, ఇప్పుడు కూడా నిద్ర లేపాం అని పేర్కొన్నారు. బనకచర్ల మీద జంగ్ సైరన్ ఊది పోరాటానికి దిగింది తాము అయితే, ఆపింది తాము అని కాంగ్రెస్ నేతలు జబ్బలు చరుచుకున్నారని విమర్శించారు. పేరుకు మాత్రమే వాళ్లు ప్రాజెక్టు ఆపుతున్నామని ప్రకటించారని,కానీ పోలవరం నుంచి బనకచర్లలో కలపకుండా, పోలవరం నల్లమల సాగర్‌కు లింకు చేశారని వివరించారు. బనకచర్ల విషయంలో కేంద్రం ఏర్పాటు చేసిన సమావేశానికి వెళ్లొద్దని సిఎం రేవంత్‌రెడ్డికి సూచించామని గుర్తు చేశారు. సమావేశానికి వెళ్లనని చెప్పిన సిఎం.. మీటింగ్‌కు వెళ్లి సంతకం చేశారని పేర్కొన్నారు. కేంద్ర జలవనరులశాఖ సమావేశం అజెండాలో గోదావరి- బనకచర్ల అంశం ఉందని, సమస్య పరిష్కారానికి ఇరు రాష్ట్రాలు కలిసి కమిటీ వేసుకుని ముందుకువెళ్తాయని ఎపి మంత్రి చెప్పారని అన్నారు. సమావేశంలో సిఎం రేవంత్‌రెడ్డి తల ఊపి బయటికి వచ్చి ప్రజలకు అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. బనకచర్లపై ముందుకు వెళ్లే విషయంలో ఎపి, తెలంగాణ ప్రభుత్వాలు కమిటీలు వేశాయని, చంద్రబాబు కమిటీ వేసిన వారానికే రేవంత్‌రెడ్డి కూడా ఒక కమిటీ వేశారని చెప్పారు. చంద్రబాబు అనుకూల అధికారి ఆదిత్యనాథ్‌దాస్ నేతృత్వంలో ఏడుగురితో రేవంత్‌రెడ్డి కమిటీ వేశారని, సిఎం వేసిన కమిటీలో ఆరుగురు ఎపితో సంబంధం ఉన్నవారే ఉన్నారని అన్నారు.ఆ కమిటీతో తెలంగాణకు ఎలా న్యాయం జరుగుతుంది. ఆదిత్య నాథ్ దాస్‌ను రేవంత్‌రెడ్డి సర్కార్ వెంటనే తొలిగించాలని డిమాండ్ చేశారు.
బనకచర్లను ఎపి ప్రభుత్వం ఎందుకు వెనక్కు తీసుకుందో కూడా ఈ ప్రభుత్వానికి తెలియదని విమర్శించారు. గోదావరి నీళ్లు కృష్ణాలో కలిపితే.. ఆ మేరకు మనకు అదనంగా నీళ్లు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. గోదావరి- బనకచర్లపై కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు లేఖలు రాశాయని, 64 టిఎంసిలు కోరుతూ కర్ణాటక, 21 టిఎంసిలు కోరుతూ మహారాష్ట్ర లేఖ రాశాయని పేర్కొన్నారు. ఆ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు లేఖలు రాయడంతో బనకచర్లపై ఎపి ప్రభుత్వం వెనక్కి తగ్గిందని, గోదావరిని కృష్ణాలో కలపకుండా నల్లమల సాగర్‌లో కలపాలనేది ఎపి సిఎం చంద్రబాబు ఆలోచన అని పేర్కొన్నారు. బచావత్ ట్రైబ్యునల్ నుంచి తప్పించుకునేందుకు మరో రూపంలో ఎపి ప్రాజెక్టు చేపడుతోందని ఆరోపించారు. గోదావరి- నల్లమల సాగర్‌కు ఎపి ప్రభుత్వం టెండర్లు కూడా వేసిందని, టెండర్ల గడువు ముగిసిన తర్వాత ఈ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లిందని చెప్పారు. ఒప్పుకొని కమిటీ వేశాక.. సుప్రీంకోర్టులో కేసు వేస్తే ఏం ప్రయోజనం అని అడిగారు. ఎపి చేపడుతున్న ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు తీరని నష్టం జరుగుతుందని వివరించారు. బనకచర్ల ప్రాజెక్టుకు సిడబ్య్లూసి అనుమతి ఇచ్చేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి ఎంత ధైర్యమని నిలదీశారు. చుక్క నీటి రైతులు ఎన్నో బాధలు పడతారని ఆవేదన వ్యక్తం చేశారు.ఎప్పుడూ వ్యవసాయం చేయని రేవంత్‌రెడ్డికి నీళ్ల బాధ ఏం తెలుసు అని హరీష్‌రావు ప్రశ్నించారు.