బనకచర్ల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తాము పోరాటం చేస్తున్నామని, సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ సైతం ఇప్పటికే దాఖలు చేశామని నీటి పారుదల శాఖ మంత్రి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నీటిపారుదల అంశంపై హరీష్‌రావు అబద్ధాల పరంపర కొనసాగుతోందని ధ్వజమెత్తారు. పోలవరం -బనకచర్ల ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్ సంఖ్య డబ్లుపి నెం. 1258 అని, ఈ కేసు జనవరి 5న సోమవారం భారత ప్రధాన న్యాయమూర్తి ముందు, కోర్టు నెం. 1, ఐటెం నెం. 11 గా విచారణకు లిస్ట్ అయినట్లు వివరించారు. బనకచర్ల ప్రాజెక్టు పై బీఆర్‌ఎస్ నేత హరీష్ రావు చేసిన ఆరోపణలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇది పోలవరం- బనకచర్ల ప్రాజెక్ట్‌పై తెలంగాణ ప్రభుత్వం చట్టబద్ధంగా పోరాడుతున్నదానికి స్పష్టమైన నిదర్శనమనిని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో హరీష్‌రావు మీడియాకు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అసత్యం, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమే అని స్పష్టం అవుతోందని వివరించారు. సాగునీటి అంశంపై హరీష్ రావు అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు.