న్యూఢిల్లీ : రష్యా లోని నోవ్‌గొరొడ్ ప్రాంత గ్రామంలో పుతిన్ ఇంటిపై ఆదివారం రాత్రి , సోమవారం ఉదయం డ్రోన్లతో ఉక్రెయిన్ దాడికి ప్రయత్నించింది. మొత్తం ప్రయోగించిన 91 దీర్ఘశ్రేణి డ్రోన్లను అన్నిటినీ నిర్వీర్యం చేసినట్టు రష్యా విదేశాంగ మంత్రి లవ్రోవ్ తెలిపారు. ఈ పరిణామాలపై ప్రధాని మోడీ స్పందించారు. అధ్యక్షుడి నివాసాన్ని లక్షంగా చేసుకున్నారన్న నివేదికలు తీవ్ర ఆందోళన కలిగించాయన్నారు.
ఘర్షణలకు ముగింపు పలుకుతూ శాంతి సాధనకు ప్రస్తుతం కొనసాగుతున్న దౌత్య ప్రయత్నం అత్యంత ఆచరణీయ మార్గమని ప్రధాని సూచించారు. అన్ని భాగస్వామ్య పక్షాలు వీటిపైనే దృష్టి పెట్టాలని, విఘాతం కలిగించే చర్యలకు అన్ని వర్గాలు దూరంగా ఉండాలని కోరుతూ ఎక్స్ వేదికగా మోడీ విజ్ఞప్తి చేశారు.