ఈ మధ్యకాలంలో 10వ తరగతి పరీక్ష విధానంలో జరుగుతున్న మార్పులు విద్యార్థులు, ఉపాధ్యాయులులేకాక విద్యావేత్తలలోనూ ఆందోళన కలిగిస్తున్నది. కరోనా కాలంలో పాఠశాల పనిదినాలు తక్కువగా ఉండటం వల్ల విద్యార్థులపై ఒత్తిడి తగ్గించడం కోసం తాత్కాలికంగా పాఠ్యాంశాలు తగ్గిస్తూ 11 పేపర్లుగా ఉన్న పదవ తరగతి పరీక్షను ఆరు పేపర్లకి తగ్గించారు. ఈ మార్పు కరోనా కాలంలో సరైనదిగానే భావించిన తర్వాత కాలంలో పాఠ్యాంశాలు కుదింపు చేయకుండా 6 పేపర్ల విధానాన్ని కొనసాగించడం వల్ల విద్యార్థుల పై మానసిక ఒత్తిడి పెరిగింది. ప్రస్తుతం 7 పరీక్షలను 35 రోజుల సుదీర్ఘ కాలంపాటు నిర్వహించాలని షెడ్యూల్ విడుదల చేయడంతో విదార్థుల్లో, ఉపాధ్యాయుల్లో మానసిక ఆందోళన మొదలైంది. ప్రస్తుతమున్న పాఠ్యపుస్తకాలు కరోనా కాలం కన్నా ముందున్న 11 పేపర్లలకు కనుగుణంగా రాయబడ్డాయి. కానీ కరోనా కాలంలో పరీక్షా విధానాన్ని ఆరుపేపర్లకు తాత్కాలికంగా తగ్గించిన తర్వాత పాఠ్యాంశాలు కుదించకుండా తగ్గించిన ఆరు పేపర్ల విధానాన్ని కొనసాగించడంతో విద్యార్థుల్లో, ఉపాధ్యాయుల్లో ఒత్తిడి పెరిగింది. ఉదా॥ సాంఘిక శాస్త్రంలో మొత్తం 21 పాఠ్యాంశాలు ఉన్నాయి. వాటికి రెండు పేపర్లతో పరీక్ష విధానం ఉండేది. విద్యార్థులు 1 నుంచి 11 పాఠ్యాంశాలకు మొదటి పేపర్, 12 నుంచి 21 పాఠ్యాంశాలకు రెండో పేపరు పరీక్ష రాసేవారు.
ఇది హేతుబద్ధంగా, శాస్త్రీయంగా ఉండేది. అయితే ప్రస్తుతం 21 పాఠ్యాంశాలకు గాను ఒకే సాంఘిక శాస్త్ర పరీక్ష, అందులో 18 ప్రశ్నలు మాత్రమే ఉండడంతో కనీసం ఒక పాఠ్యాంశం నుంచి ఒక ప్రశ్న కూడా లేని విధంగా ప్రశ్నాపత్రం ఉండడంలో శాస్త్రీయత ఉందా? సాంఘిక శాస్త్ర మూల్యాంకనానికి ఒక పేపర్ ఉండాలన్నప్పుడు 21 పాఠ్యాంశాలలో కనీసం ఐదు పాఠ్యాంశాలైన తగ్గించాల్సి ఉండే. ప్రస్తుత విద్యా సంవత్సరానికిగాను పదవ తరగతి పరీక్షలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు నిర్వహించాలని బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విడుదల చేసిన షెడ్యూలు విద్యార్థుల్లో మానసిక ఒత్తిడిని తగ్గించడం అటు ఉంచితే, మానసిక ఆందోళనను పెంచుతుంది. ఒక సబ్జెక్టులకు 4, 5 రోజుల విరామం కాకుండా ఒకటి, రెండు రోజుల విరామం ఉండాల్సింది. పరీక్షల షెడ్యూలు తయారు చేసే ముందు ఫీల్డ్‌లో అనుభవం ఉన్న ఉపాధ్యాయుల సలహాలు తీసుకొని ఉండాల్సింది. ఏకంగా 35 రోజులపాటు 10వ తరగతి పరీక్షలు నిర్వహిస్తే అన్ని రోజులు పాటు విద్యార్థులు పరీక్షపై దృష్టిని నిలిపి ఉంచలేరూ. ఇది విద్యార్థుల్లో ఒక రకమైన నిరుత్సాహాన్ని పెంచుతుంది. పరీక్షల మధ్య ఎక్కువ వ్యవధి ఉండడంతో, విద్యార్థులు బయట తిరగడం వల్ల అనారోగ్యానికి గురి అయితే, ఇది మొత్తంగా పరీక్షలపై తీవ్ర ప్రభాతం చూపే అవకాశం ఉంటుంది. సిబిఎస్‌ఇ విధానాన్ని బట్టి పదవ తరగతి షెడ్యూల్ తయారు చేసినట్లు తెలుస్తుంది.
అయితే ఇక్కడ ఒక విషయాన్ని లోతుగా అధ్యయనం చేయాల్సి ఉండే. సిబి ఎస్‌సి పాఠ్యాంశాలు చదువుతున్న విద్యార్థుల సామాజిక, ఆర్థిక పరిస్థితులు వేరు ప్రభుత్వ, జిల్లా పరిషత్, కెజిబివి, మోడల్ స్కూల్ లాంటి స్టేట్ సిలబస్ చదువుతున్న విద్యార్థుల సామాజిక, ఆర్థిక పరిస్థితులు వేరు. సిబిఎస్‌ఇలో చదువుతున్న విద్యార్థుల్లో మెజారిటీగా అర్బన్ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఉంటారు. అందులో తల్లిదండ్రులు అక్షరాసులై ఉంటారు. అదే ప్రభుత్వ, జిల్లా పరిషత్, కెజిబివి, మోడల్ స్కూల్ తదితర సంస్థలలో చదివే విద్యార్థులు పూర్తిగా గ్రామీణ ప్రాంతాలలో ఉంటారు. తల్లిదండ్రులలో నిరక్షరాస్యులు ఎక్కువగా ఉంటారు. 7 పరీక్షలకు 35 రోజుల టైమ్‌లో మధ్యలో విరామం ఎక్కువగా ఉండటం వల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులు పనులకు వెళ్ళవలసి రావడంతో చదువుపై దృష్టి కేంద్రకరించలేరు. తల్లిదండ్రులు కూడా అన్ని రోజులు విద్యార్థులపట్ల శ్రద్ధ వహించలేరు, వారికి కావలసిన సౌకర్యాలు అందించలేరు. ఇది మొత్తంగా పరీక్ష ప్రిపరేషన్ విధానాన్నీ దెబ్బతిసే అవకాశం ఉంది. ప్రభుత్వ, జిల్లా పరిషత్, కెజిబివి, మోడల్ స్కూల్ లాంటి పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరూ నెల రోజులపాటు పదో తరగతి పరీక్షల్లో నిమగ్నమైతే హోం పరీక్షలపై ప్రభావం పడుతుంది. హోం పరీక్షలకు విద్యార్థులను సంసిద్ధులను చేయాలన్నా, పరీక్షలను గుణాత్మకంగా నిర్వహించాలన్నా సబ్జెక్ట్ ఉపాధ్యాయులు అందుబాటులో ఉండాలి. 35 రోజులపాటు 10వ తరగతి పరీక్షలు నిర్వహించిన వెంటనే మూల్యాంకనానికి సీనియర్ ఉపాధ్యాయులు వెళ్ళవలసి ఉంటుంది. ఇది 6, 7, 8, 9 తరగతుల విద్యార్థులను హోం పరీక్షలకు తయారు చేయడంపై ప్రభావం చూపుతుంది. 10వ తరగతి విద్యార్థులను 6, 7, 8, 9, తరగతుల విద్యార్థులను ఒకేసారి పరీక్షలకు సంసిద్ధం చేయలేము.35 రోజులు పదవ తరగతి విద్యార్థులపై దృష్టి సారించాల్సి రావడం వలన హోం పరీక్షలను నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంటుంది. సిబిఎస్‌సి పాఠశాలల్లో పదవ తరగతి పరీక్షల కంటే ముందు హోం పరీక్షలు నిర్వహించి, తర్వాత పదవ తరగతి పరీక్షలు నిర్వహించే వారు, ఈ నిర్వహణలో హేతుబద్ధత, శాస్త్రీయత ఉంది.
ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి పదవ తరగతి పరీక్షలు రెండు దాఫాలుగా నిర్వహిస్తారు. మొదటి దశలో ఫిబ్రవరిలో నిర్వహించి మార్చి, ఏప్రిల్‌లో హోం పరీక్షల్లో నిర్వహిస్తారు. రెండవ దశ పరీక్షలు మే లో నిర్వహిస్తారు. ఈ విధానంలో కూడా హేతుబద్ధత, శాస్త్రీయత ఉంది. అయితే ఎస్‌ఎస్‌సి బోర్డు షెడ్యూలు ప్రకారం మార్చి 14 న ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 16 వరకు సుమారు 35 రోజులు నిర్వహిస్తారు. అదే ఏప్రిల్‌లో హోమ్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. రెండు పరీక్షలు ఒకేసారి నిర్వహించాలంటే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. 10వ తరగతి విద్యార్థులు 35 రోజుల పాటు పరీక్షలు రాస్తే రెసిడెన్షియల్ పాఠశాలలో హోం ఎగ్జామ్స్ రాసే విద్యార్థులపై ఆ ప్రభావం ఉంటుంది. నెల రోజులపాటు విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడడం, వారికి పరీక్షలు సక్రమంగా నిర్వహించడం కత్తిమీద సామే అవుతుంది. సుదీర్ఘంగాఉన్న పరీక్షల ప్రస్థానం వల్ల తదుపరి పాలిటెక్నిక్ లాంటి కాంపిటీషన్ పరీక్షలకు ప్రిపేర్ కావడానికి సమయం ఉండకపోవచ్చు. విద్యా వ్యవస్థలో సంస్కరణలు విద్యార్థులను కార్యోన్ముఖులను చేయలేగాని, కార్యహీనులను చేయరాదు. సంస్కరణలు ఫీల్డ్ స్థాయి సమస్యలను పరిష్కరించేదిగా ఉండాలి కానీ, సమస్యలు సృష్టించేదిగా ఉండకూడదు. సంస్కరణలు స్థానిక సామాజిక, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఉండాలే గాని మరో వ్యవస్థను అనుసరించినట్లుగా ఉండకూడదు. పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు అధిక భాగం గ్రామీణ ప్రాంత విద్యార్థులే కాబట్టి ప్రస్తుతం ప్రకటించిన 10వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ను పునర్ సమీక్షించవలసిందిగా విద్యార్థులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.
జుర్రు నారాయణ యాదవ్
94940 19270