మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా పాత ఏడాదికి వీడ్కోలు పలికి, కొత్త జోష్‌తో నూతన సంవత్సర వేడుకలు ఈ పాటికే ఊపందుకున్నాయి. వేడుకల పేరుతో హద్దు మీరి ప్రవర్తిస్తే ఏ మాత్రం సహించేది లేదని, కఠిన చర్యలు తప్పవని పోలీసులు మరోవైపు హెచ్చరిస్తున్నారు. యువత పెడదారిన పడకుండా వేడుకలు ప్రశాంతంగా జరుపుకునేలా చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.కార్యక్రమం జరిగే ప్రాంతంలో ప్రవేశం, బయటకు వెళ్లే మార్గాల్లో సిసి కెమెరాలు తప్పనిసరి అని, బహిరంగ ప్రదేశాల్లో లౌడ్‌స్పీకర్లు, డిజెలను రాత్రి 10 గంటలకు నిలిపివేయాలని, ఇండోర్‌లో అర్ధరాత్రి 1 గంట వరకు తక్కువ శబ్ధం (45 డెసిబుల్) సౌండ్ మాత్రమే ఉండాలని సూచించారు. పార్టీల్లో బాణ సంచాకు అనుమతి నిరాకరించారు. అదే విధంగా నూతన సంవ త్సర వేడుకల్లో మితిమీరిన వాహనవేగం పనికి రాదని, మితిమీరే ఉత్సాహం ప్రమాదాలను కొని తెస్తుందన్నారు. మైనర్లు ద్విచక్ర వాహనం, కారు నడపరాదన్నారు. ట్రిఫుల్ రైడింగ్ చేసినా, సైలెన్సర్లు తీసి ప్రజలను
భయభ్రా ంతులకు గురి చేసినా వాహనం స్వాధీనం చేసుకుంటామని హెచ్చరిం చారు. ముఖ్యంగా రహదారులు, కూడళ్లలో గుమికూడి కేక్‌లు కట్ చేయ రాదని, బాణసంచా కాల్చకూడదని హెచ్చరించారు. కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలు, ఇంకెక్కడైనా డిజెలతో హోరెత్తించడం అనేది పూర్తిస్థాయిలో నిషిద్ధమని పేర్కొన్నారు. తల్లిదండ్రులు పిల్లలను వేడుకలకు బయటకు పంపకూడదని, వాహనాలపై ర్యాలీగా, వేగంతో వెళ్లకూడదని, ఇలా వెళ్లి ప్రమాదాలకు కారణమైతే చర్యలు తప్పవని హెచ్చరించారు.రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిందని, ప్రమాదాల బారిన పడినవారిలో యువతే ఎక్కువగా ఉంటున్నారన్నారు. ఈ నేపథ్యంలో నూతన సంవత్సర వేడుకల వేళ పోలీసులు కఠిన ఆంక్షలను విధిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాల పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈనెల 31న సాయంత్రం 6 నుంచి పూర్తిస్థాయి నిఘాను పోలీసులు ఏర్పాటు చేయనున్నారు అదే విధంగా గ్రామాల్లోనూ ఫుల్ గస్తీని పెంచనున్నారు. రహరాదులపై డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు విస్తృతం చేయనున్నారు. ఇక పబ్‌లు, బార్లలో మైనర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదని హెచ్చరించారు.
రంగంలోకి ఈగల్ టీం… డ్రగ్స్‌పై నిరంతర నిఘా
నూతన సంవత్సర వేడుకల వేళ పోలీస్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఈగల్ టీమ్ కఠిన చర్యలకు సిద్ధమైంది. డ్రగ్స్ వినియోగం అరికట్టే దిశగా ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపుతోంది. ఒక్క హైదరాబాద్‌లోనే డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టడం కోసం 150 మంది సభ్యులతో కూడిన 12 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించుతోంది. పబ్ లు, క్లబ్ లు, రిసార్ట్ లు, శివార్లలో ఉన్న ఫామ్ హౌస్‌ల పైన ప్రత్యేక నిఘా పెడుతోంది. ఎవ రైనా డ్రగ్స్ వినియోగిస్తూ, లేదా సరఫరా చేస్తూ పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. జిల్లాల్లోనూ ఈగల్ టీం ప్రత్యేక బృందాలు పనిచేయనున్నాయి. డిజె నిర్వాహకులపై ఈసారి టెస్ట్ లు ప్రారంభిస్తున్నట్టు ఈగల్ టీం పేర్కొంది. పబ్ లలో తనిఖీలు ప్రారం భించగానే డిజె ఆపరేటర్లకు డ్రగ్ టెస్ట్ చేస్తామని, ఇతర సిబ్బందికి అనుమానిత వ్యక్తులకు పరీక్షలు నిర్వహిస్తామని, డ్రగ్ సరఫరాలో కానీ విని యోగంలో కానీ డీజేల పాత్ర ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఫామ్ హౌస్ పార్టీల పేరుతో అసాంఘిక కార్యకలా పాలకు పాల్పడితే యజమానుల పైన కూడా చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
క్యాబ్ డ్రైవర్లను ఏర్పాటు చేయాలి
బార్లు, పబ్‌ల నిర్వాహకులు కస్టమర్స్‌ను సురక్షితంగా గమ్యం చేర్చేందుకు క్యాబ్స్, డ్రైవర్లను ఏర్పాటు చేయాలని పోలీసులు సూచించారు. మందుకొట్టి వాహనం నడుపుతూ పట్టుబడితే కేసు నమోదు చేస్తారన్నారు. పట్టుబడిన వాహనాన్ని పోలీస్ స్టేషన్‌కు తరలిస్తామని, న్యాయస్థానం రూ.10వేల వరకు జరిమానా విధించడం లేదా 6 నెలలు జైలుశిక్షను విధించవచ్చన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారి డ్రైవింగ్ లైసెన్స్ మూడు నెలలు పూర్తిగా సస్పెండ్ చేసే అవకాశం కూడా ఉంది. మైనర్లు బండి నడుపుతూ పట్టుబడితే ప్రమాదానికి కారణమైతే ఓనర్‌దే పూర్తి బాధ్యత అని పోలీసులు స్పష్టం చేశారు. జైక్‌లకు సైలెన్సర్ తొలగించి శబ్ధ కాలుష్యానికి కారకులు కాకూడదని సూచించారు.
తనిఖీలలో సలైవా డ్రగ్ టెస్ట్ కిట్లు.. దొరికితే కటకటాలే
ఈసారి తనిఖీలలో డ్రగ్స్ టెస్ట్ కిట్లను ఉపయోగిస్తున్నట్లు, సలైవా డ్రగ్ టెస్ట్ తో కేవలం కొద్ది నిమిషాలలోనే వ్యక్తి డ్రగ్ తీసుకున్నారో? లేదో నిర్ధారణ అవుతుందని పోలీసులు తెలిపారు ఒకవేళ పరీక్షలో పాజిటివ్ అని తేలితే సదరు వ్యక్తిపై ఎన్‌డిపిఎస్ చట్టం ప్రకారం కఠినమైన కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.