ముంబై: వచ్చే ఏడాది జనవరి 9 నుంచి జరుగనున్న మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్లూపిఎల్) సీజన్ 2026 నుంచి ఆస్ట్రేలియాకు చెందిన స్టార్ క్రికెటర్లు ఎల్లిస్ పెర్రీ (ఆర్‌సిబి), అన్నాబెల్ సదర్లాండ్ (ఢిల్లీ) వైదొలిగారు. వ్యక్తిగత కారణాలతో వీరు ఈ టోర్నీ నుంచి తప్పుకున్నారు. కిందటి సీజన్‌లో అద్భుతంగా రాణిచిన పెర్రీ దూరం కావడం బెంగళూరు టీమ్ కు పెద్ద ఎదురుదెబ్బగానే విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.
2024లో పెర్రీ 347 పరుగులు చేసి బెంగళూరుకు డబ్లూపిఎల్ ట్రోఫీ అందించడంలో కీలక పాత్ర పోషించింది. పెర్రీని ఆర్‌సిబి టీమ్ రూ.2 కోట్లకు రిటైన్ చేసుకుంది. అయితే పెర్రీ అనూహ్యంగా టోర్నీ నుంచి తప్పుకోవడంతో బెంగళూరు టీమ్ షాక్‌కు గురైంది. ఇక స్టార్ ఆల్‌రౌండర్ సదర్లాండ్ కూడా డబ్లూపిఎల్‌కు దూరమైంది. ఇది ఢిల్లీకు గట్టి ఎదురుదెబ్బగా చెప్పాలి. కిందటి సీజన్‌లో సదర్లాండ్ 9 వికెట్లు తీసి ఢిల్లీని ఫైనల్‌కు చేర్చడంలో తనవంతు పాత్ర పోషించింది.