బెంగాల్ ఉగ్రవాదులకు హబ్‌గా మారిందని, కేంద్రహోం మంత్రి అమిత్‌షా చేసిన ఆరోపణలకు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. పశ్చిమబెంగాల్ ఉగ్రవాదుల స్థావరంగా ఉన్నట్టయితే మీరు పహల్గాం నిర్వహించారా ? అని ఆమె నిలదీశారు. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు లేనప్పుడు పహల్గాం సంఘటన ఎలా సంభవించింది ?అలాగే ఢిల్లీలో ఉగ్రవాదుల బాంబు దాడి జరిగినప్పుడు దాని వెనుక ఎవరు ఉన్నారో పహల్గాం నిర్వహించారా ? అని ప్రశ్నించారు. బంకురా లోని బిర్సింగ్‌పూర్‌లో మంగళవారం ర్యాలీని ఉద్దేశించి మమతా బెనర్జీ మాట్లాడారు. మహాభారతం లోని దుశ్శాసన, దుర్యోధనులతో అమిత్‌షా, నరేంద్రమోడీలను పోల్చి ధ్వజమెత్తారు. శకుని శిష్యుడైన దుశ్శాసనుడు సమాచారం సేకరించడానికి బెంగాల్‌కు వచ్చారని, ఎన్నికలు రాగానే దుశ్శాసన, దుర్యోధనులిద్దరూ రాష్ట్రంలో కనబడడం ప్రారంభిస్తారని వ్యాఖ్యానించారు. 2026 అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నతరుణంలో డిసెంబర్ 20న ప్రధాని మోడీ, బెంగాల్‌ను సందర్శించగా, ప్రస్తుతం మూడు రోజుల పర్యటనలో అమిత్‌షా ఉన్నారని వ్యాఖ్యానించారు.
అవసరమైన భూమిని సరిహద్దులో కేటాయించకపోవడం వల్లనే కంచె వేయలేకపోతున్నట్టు అమిత్‌షా ఆరోపణలకు సమాధానం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం భూములు కేటాయించడం వల్లనే కేంద్రం రైల్వే ప్రాజెక్టులను అమలు చేయగలిగిందన్నారు. సరిహద్దులో పెట్రపోల్, ఛంగ్రబండ వల్ల భూములను ఇప్పటికే కేంద్రానికి కేటాయించినట్టు చెప్పారు. ఓటర్ల జాబితా సమగ్ర సర్వే గురించి ప్రస్తావిస్తూ ఈ సర్వేపేరుతో రాష్ట్రం లోని ప్రజలను వేధిస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రక్రియ కింద దాదాపు 1.5 కోట్ల మంది ఓటర్లను జాబితాల నుంచి తొలగించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని, ఈ విషయంలో రాజబన్షీలు,మాతువాలను ,ఆదివాసీలను టార్గెట్ చేసుకున్నారని విమర్శించారు. బెంగాలీల ఓట్ల హక్కును నిస్సంకోచంగా లాగివేయడానికే ఇదంతా అని ఆమె ఆరోపించారు. ఎఐ ఉపయోగించి ఈ ప్రక్రియ చేయడం పెద్ద స్కామ్‌గా ఆమె వ్యాఖ్యానించారు. కేవలం మీరు (అమిత్‌షా) మీ అబ్బాయి మాత్రమే ఉంటారా ? అని వ్యాఖ్యానించారు. బీఎల్‌ఓలతో సహా అనేక మంది ఈ ఎస్‌ఐఆర్ సందర్భంగా ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. అర్హులైన ఓ ఒక్కరి పేరు ఓటరు జాబితా నుంచి తొలగిస్తే ఢిల్లీ లోని ఎన్నికల కమిషన్ ఆఫీస్ వద్ద ఘెరావ్ చేస్తామని స్పష్టం చేశారు. ఒడిశా. రాజస్థాన్,ఉత్తరప్రదేశ్‌ల్లో బెంగాలీ వలస కార్మికులపై హింసాకాండ సాగుతోందని విమర్శించారు.