హైదరాబాద్: ఇరిగేషన్ లో తానే మాస్టర్ అని బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అనుకుంటున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. హరీష్ రావు దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. హరీష్ రావు పై ఉత్తమ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు.. హరీష్ రావుకు అంత అహంకారం ఎందుకు? అని.. ప్రశ్నించారు. ఎవరి హయాంలో ఏం జరిగిందో అన్ని పత్రాలు బయటపెడతామని, పాత జీవో కాపీలను మీడియాకు చూపారు. కృష్ణా జలాల్లో తాము 90టిఎంసిలు డిమాండ్ చేశామని, తాము 45 టిఎంసిలు అడిగామని దుష్ప్రచారం చేశారని విమర్శించారు. అబద్ధాల పునాదుల మీదే బిఆర్ఎస్ బతుకుతోందని, తెలంగాణకు అన్యాయం జరిగేలా తాను ఎందుకు లేఖ రాస్తానని ఉత్తమ్ ప్రశ్నించారు. సిడబ్ల్యూసికి రాసిన లేఖలో ఒక భాగాన్నే చూపిస్తున్నారని, కృష్ణా బేసిన్ పై అసెంబ్లీ ప్రజెంటేషన్ కు తాము సిద్ధమని సవాల్ విసిరారు. మేడిగడ్డ మరమ్మత్తులపై ఎల్అండ్ టికి నోటీసులిచ్చామని, మేడిగడ్డలో పలు పరీక్షలు, ఇతర తనిఖీలకు ఎల్అండ్ టి ఒప్పుకుందని పేర్కొన్నారు. త్వరలోనే మేడిగడ్డ పనులు మొదలవుతాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.