క్రమసరలితకంఠ- ప్రక్రమోల్లాసితోరః
తరళిత-వళిరేఖా-సూత్రసర్వాంగ మస్యాః
స్థితమతి-చిరముచ్చై-రగ్ర-పాదాంగుళీభిః
కరకలిత-సఖీకం మాం దిదృక్షోః స్మరామి
ఒక స్త్రీ తన స్నేహితురాళ్ళతో కలిసి వెళ్తోంది. అదే దారిలో కాళిదాసు కూడా వెళ్తున్నాడు. సుప్రసిద్ధుడు కనుక కవిని చూడాలని ఆశపడుతోంది కానీ గుంపులోని తలలేమో అడ్డుకుంటున్నాయి. అతని ముఖమెట్లా ఉంటుందో చూద్దామనుని ఆమె కంఠాన్ని సాగదీస్తున్నప్పుడు హృదయ భాగం ముందుకు దూకుతోంది. ఇక కుదరదని కాలి వేళ్ళ మీద నిలబడి చూస్తోంది. పడకుండా ఉండేందుకు స్నేహితురాళ్ళ చేతుల్ని పట్టుకుంది. అంతలా తనకేసి చూడాలనుకున్న ఆ యువతిని స్మరిస్తున్నానంటాడు కాళిదాసు. ఈ శ్లోకాన్ని ఒకసారి దృశ్యమానం చేసుకోండి. కిక్కిరిసిన ఒక వీధి. అందులో నడిచి వెళ్తున్న సుప్రసిద్ధ కవి శిఖరం. మళ్ళీమళ్ళీ కనబడని తనను చూడాలని ఉబలాటపడే యువతి, అది అర్థం అయి ఆమెను స్మరించే కవి. తనను చూసేందుకు తపన పడే యువతిని “స్మరించటం” ఏదైతే ఉందో అది నాగరిక లక్షణం. ముఖంలో ముఖం పెట్టి చూస్తే అది తెంపరితనం. ఔచిత్యం తెలిసిన కాళిదాసు ఆమెను నమ్రతగా స్మరిస్తాడు. వీధిలోని దృశ్యాన్ని నీటిలోని కలువలా తెంపి తెస్తాడు.
శ్లోకాన్నిలా బొట్టుబొట్టుగా విప్పినప్పుడు అర్థమౌతుంది రస స్పర్శ ఉన్న జనం కాళిదాసును కవి రాక్షసుడు అని ఎందుకంటారో. ప్రాచీన కవులను అందులోనూ ప్రత్యేకించి సంస్కృత కవుల్ని చదివినప్పుడు నాడుల్లో చందన తాంబులాలు దాచినట్టుంటుంది. లోకం పట్ల, విలువల పట్ల అనిర్వచనీయ గౌరవం కలుగుతుంది. ఏ తెలియని ఇంద్రజాలమో బుద్ధిలోని వక్రతను మాయం చేసిపోతుంది. ఇది వినా చదువరి ఆశించే సారస్వత ప్రయోజనం ఏముంటుంది ? కవిత్వానికి కాళిదాసు అద్దిన ఈ నాగరిక స్పర్శ తదనంతర తరాలకు దారి దీపం అయింది. ఏ పోలిక తెచ్చినా అందులో తేమ శాతం ఉందో లేదో వెతకటం మొదలైంది. వచన కవితలో దిగుమతైన బండ్ల కొద్దీ చెత్త ఆ కాలంలో కూడా ఉంది వేరే రూపంలో. కానీ అదేదీ కాలానికి నిలబడలేదు. ఏ రాతైతే మనను ఆసాంతం పట్టి ఊపుతుందో, బుద్ధిని బంతిలా కొట్టి లేపుతుందో అది మాత్రమే శుక్ర తారలా నిలబడుతుంది. దానినే విద్వాంసులు ఔచిత్యం అంటారు. అన్యులు స్పర్శ అనుకుంటారు. ఈ నేపథ్యంతో విద్వదౌషధం అనబడే హర్ష నైషధంలోని శ్లోకం చూద్దాం-
సరోరుహం తస్య దృశైవ నిర్జితం
జితాః స్మితేనైవ విధోరపి శ్రియః
కుతః పరం భవ్యమహో మహీయసీ
తదాననస్యోపమితౌ దరిద్రతా
వాడి కళ్ళ ముందు తామరలు, నవ్వు ముందు చంద్రకాంతులు ఓడిపోయాయి. విలువైన పోలికలు తీసికట్టుగా మిగిలాక ముఖాన్నెట్లా పోల్చాలో తెలియని దారిద్య్రం కమ్ముకుంది. తామర పుష్పాల కన్నా అందమైన కళ్ళు, చంద్రకాంతుల కన్నా గొప్పవైన చూపులు లోకంలో ఉండవని కదా అందరూ అంటారు. ఆ మాటను అబద్ధం చేస్తూ నలుడు కనబడినప్పుడు ఉపమలు కూడా ఓడిపోయాయట. తామర పుష్పాల్లాంటి కళ్ళు, చంద్రకాంతుల వంటి చూపులు అని రాస్తే ఆ శ్లోకాన్నెవరూ పట్టించుకోరని హర్షుడికి తెలుసు. అందుకే దాన్ని తిప్పి రాస్తాడు. పోలికలు ఓడిపోయాయన్న చిన్న మాటతో దాన్ని నిలబెడతాడు. కథా కావ్యాలు రాస్తున్నప్పుడు ఇంకో అంకంలోకి వెళ్ళే వరకు అలరించటం అవసరం కనుక తెలిసిన ఊహల్ని చిలికి రాస్తారు ప్రాచీన కవులు. ఐతే హర్షుడు వాటిని మార్చి చెబుతాడు. ముతక మాటల్ని తిప్పి కొడతాడు.
– రఘు