వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ జేసన్ హోల్డర్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సాధించాడు. ఈ ఏడాది (2025)లో హోల్డర్ 69 మ్యాచుల్లో 97 వికెట్లు తీశాడు. ఇంటర్నేషనల్ లీగ్ టి-20లో భాగంగా గల్ఫ్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హోల్డర్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో అబుదాబీ నైట్‌రైడర్స్ తరఫున 2 వికెట్లు తీసి తన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
హోల్డర్ కంటే ముందు ఓ క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక టి-20 వికెట్లు తీసిన రికార్డు అఫ్గాన్ బౌలర్ రషీద్ ఖాన్ పేరిట ఉండేది. రషీద్ 2018లో 61 మ్యాచుల్లో 96 వికెట్లు తీశాడు. ఇక హోల్డర్, రషీద్ తర్వాతి స్థానాల్లో డ్వేన్ బ్రావో, నూర్ అహ్మద్ ఉన్నారు. బ్రావో 2016లో 72 మ్యాచుల్లో 87 వికెట్లు తీయగా.. నూర్ అహ్మద్ అదే ఏడాది 64 మ్యాచుల్లో 85 వికెట్లు తీశాడు.