రాష్ట్రంలో రైతుబంధు కాలన పోయి, రాబందు పాలన వచ్చిందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లయినా ఇప్పటికీ ఏ ఒక్క హామీ నెరవేరలేదని విమర్శించారు. తెలంగాణ భవన్‌లో సోమవారం బోథ్ నియోజకవర్గ పరిధిలో గెలిచిన నూతన సర్పంచుల ఆత్మీయ సన్మాన సమావేశంలో కెటిఆర్ పాల్గొని మాట్లాడారు. గ్రామాలకు వచ్చే నిధులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చే మెహర్బానీ కాదు అని, అది రాజ్యాంగబద్ధంగా గ్రామాలకు సర్పంచులకు దక్కిన హక్కు అని పేర్కొన్నారు. గెలిచిన సర్పంచులు నిరాశ చెందాల్సిన అవసరం లేదని, రెండు సంవత్సరాల తర్వాత వచ్చే మన ప్రభుత్వంలో ప్రతి గ్రామాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసుకుందామని భరోసా ఇచ్చారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లోను పంచాయతీరాజ్ ఎన్నికల స్ఫూర్తితో పని చేద్దామని పిలుపునిచ్చారు.అలాగే ఎంపిటిసి, జెడ్‌పిటిసి స్థానాల్లో కూడా మంచి విజయం సాధించేలా కలిసి కృషి చేద్దామని అన్నారు. అదిలాబాద్ జిల్లాలో అత్యధిక రైతులు పండించే పత్తి పంట కొనుగోలు చేసే పరిస్థితి కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో లేదని విమర్శించారు. ఈ ముఖ్యమంత్రి వచ్చాక పత్తి రైతు చిత్తయిపోయాడని, సోయా రైతులను పట్టించుకునే వాళ్ళు లేరని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం రాష్ట్ర రైతాంగాన్ని తీవ్ర ఇబ్బందుల పాలు చేస్తున్నదని మండిపడ్డారు. తెలంగాణ రైతన్న తమ పార్టీ హయాంలో రాజు లెక్క ఉండేవాడని, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అన్ని ఆయన ఇంటి ముందుకు వచ్చేవి అని పేర్కొన్నారు. అందుకే ఏనాడూ తెలంగాణలోని రైతన్న కెసిఆర్ మీద కోపంతో లేడు అని చెప్పారు.
రైతుబంధు ఇచ్చిన రైతు బీమా ఇచ్చినా 7 వేల కేంద్రాలు పెట్టి కొనుగోలు పంట కొనుగోలు చేసినా అన్ని రైతన్న కోసమే చేసిన గొప్ప నాయకుడు కెసిఆర్ అని వ్యాఖ్యానించారు. కెసిఆర్ గోదావరి కృష్ణా నదులపైన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేశారని, అందుకే తెలంగాణ రాష్ట్రం పంజాబ్ వంటి రాష్ట్రాలను తలదన్ని దేశంలోనే అత్యధికంగా ధాన్యం ఉత్పత్తి చేసిన రాష్ట్రంగా నిలిచిందని తెలిపారు. అదిలాబాద్ జిల్లాలో కేవలం కొన్ని వేల ఓట్లతో అదిలాబాద్,ఖానాపూర్,కాగజ్‌నగర్ వంటి నియోజకవర్గాలు కోల్పోయామని అన్నారు. చిన్నచిన్న పొరపాట్ల వల్ల ఈ సీట్లని కోల్పోయామని, కానీ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు బిఆర్‌ఎస్ పార్టీ వెంట ఉన్నామని తేల్చి చెప్పారని పేర్కొన్నారు. మరో రెండేళ్ల తర్వాత కచ్చితంగా తమ పార్టీ అధికారంలోకి వస్తుంది, మళ్లీ కెసిఆర్ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఎంఎల్‌ఎ అనిల్ యాదవ్ డబ్బులు ధర్పం లేకపోవచ్చు.. కానీ, మంచి మనసున్న నాయకుడు అని, అలాంటి నాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీ పైన, పార్టీ శ్రేణులపైన ఉన్నదని చెప్పారు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాను బిఆర్‌ఎస్ పార్టీ హయాంలో అద్భుతంగా అభివృద్ధి చేశామని వ్యాఖ్యానించారు. కానీ,బిజెపి సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీని తెరుస్తామని చెప్పి స్వయంగా అమిత్ షా మాట ఇచ్చి తప్పారని విమర్శించారు. రెండు సంవత్సరాల కాలంలో రెండున్నర లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిన రేవంత్ రెడ్డి తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు.