రెండేళ్లయినా ఉత్తమ్‌కుమార్ రెడ్డికి ఇంకా తన శాఖపై అవగాహన రాలేదని మాజీ మంత్రి,బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్ రావు పేర్కొన్నారు. మంత్రి ఉత్తమ్.. ఉత్త మాటలు మాట్లాడవద్దని అన్నారు. ఉత్తమ్‌కు సిఎం రేవంత్ రెడ్డి గాలి సోకినట్టుందని, ఆయనకు రేవంత్ రెడ్డి సావాస దోషం పట్టుకుందని అన్నారు. పాలమూరు ప్రాజెక్ట్‌ను 90 టిఎంసిలను 45 టిఎంసిలకు తగ్గించారా.. లేదా..? ఉత్తమ్ చెప్పాలని డిమాండ్ చేశారు. డిపిఆర్ వాపస్ వచ్చి ఏడాది అయినా.. మౌనం ఎందుకు..? అని ప్రశ్నించారు. తమ హయాంలో ఏడు అనుమతులు తెచ్చామని, ఈ ప్రభుత్వం రెండేళ్లలో ఒక్క అనుమతి అయినా తెచ్చారా..? అని అడిగారు. కాంగ్రెస్ నేతలు గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టులో కేసు వేసి ప్రాజెక్ట్‌ను అడ్డుకున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టు పనులు ఆగకూడదని తాము తాగునీటి పనుల పేరిట పనులు కొనసాగించామని తెలిపారు. 90 టిఎంసిలకు డిపిఆర్ ఇచ్చి ఏడు అనుమతులు తీసుకొచ్చామని, రెండు టిఎంసిల కోసం రెండు టన్నెల్‌లు తామే తవ్వామని అన్నారు. కాంగ్రెస్ నేతలు కేసు వేస్తే తాము స్టే ఎత్తివేయించి అనుమతులు తీసుకొచ్చామని పేర్కొన్నారు. కొడంగల్ – నారాయణపేట ఎత్తిపోతలకు రెండేళ్ల క్రితం కొబ్బరికాయ కొట్టారని,
డిపిఆర్ ఇప్పటికీ పంపలేదని చెప్పారు. తాము 27 వేల కోట్లు ఖర్చు పెట్టామని, 27 వేల ఎకరాల భూమి సేకరించామని, కానీ కోర్టుల్లో కేసులు వేసి పాలమూరుకు ద్రోహం చేసింది కాంగ్రెస్ నేతలు అని పేర్కొన్నారు. 1985లో కల్వకుర్తికి కొబ్బరికాయ కొట్టి 2014 వరకు 14 వేల ఎకరాలకు నీరు ఇచ్చారని, తాము 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు మూడు లక్షల ఎకరాలకు పైగా నీరు ఇచ్చామని, కల్వకుర్తిపై 2300 కోట్లు ఖర్చు పెట్టామని వివరించారు. ఎస్‌ఎల్‌బిసి సొరంగం బిఆర్‌ఎస్ హయాంలో 11 కిలోమీటర్లకు పైగా తగ్గితే… రెండేళ్లలో కాంగ్రెస్ 200 మీటర్లు మాత్రమే తవ్విందని విమర్శించారు. బిఆర్‌ఎస్ హయాంలో ఏడు డిపిఆర్‌లకు అనుమతులు తీసుకొస్తే… కాంగ్రెస్ హయాంలో మూడు డిపిఆర్‌లు వెనక్కు వచ్చాయని అన్నారు. రెండేళ్లలో కాంగ్రెస్ ఒక్క డిపిఆర్ పంపలేదు, ఒక్క అనుమతి కూడా తీసుకురాలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్, టిడిపి 60 ఏళ్లలో లక్ష ఎకరాలకు నీరు ఇస్తే… తొమ్మిదిన్నరేళ్లలో ఆరున్నర లక్షల ఎకరాలకు పైగా నీళ్లిచ్చామని అన్నారు. పాలమూరుకు బిఆర్‌ఎస్ ఏం చేసిందో దీంతో అర్థమవుతోందని వ్యాఖ్యానించారు.