న్యూఢిల్లీ: భారతీయ సైన్యానికి ఆయుధ సంపత్తి ఇనుమడించనుంది. రూ 79000 కోట్ల మేర పలు రకాల ఆయుధాలు, హార్డ్‌వేర్ కొనుగోళ్లకు రక్షణ మంత్రిత్వశాఖ అనుమతి ఇచ్చింది. దూర లక్షాల ఛేదక రాకెట్లు, క్షిపణులు, రాడార్ వ్యవస్థలు, మిలిటరీ ప్లాట్‌ఫాంల కోసం ఈ మొత్తం వెచ్చిస్తారని అధికార వర్గాలు సోమవారం తెలిపాయి. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన రక్షణ సమీకరణల మండలి (డాక్) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రిత్వశాఖ ప్రతిపాదనలకు డిఎసి సమ్మతి తెలిపింది.
సైనిక పోరాట పటిమ పెంచేందుకు , మారుతున్న యుద్ధ తంత్రాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు మిలిటరీ హార్డ్‌వేర్ పెంచుకునేందుకు నిర్ణయం తీసుకున్నారు. తక్కువ బరువు రాడార్లు, పినాకా రాకెట్ సిస్టమ్‌కు అవసరం అయిన ఎల్‌ఆర్ నిర్ధేశిత రాకెట్ ఆయుధాలను ఈ కేటాయింపులతో సైన్యం కోసం రక్షణ మంత్రిత్వశాఖ సమీకరిస్తుంది. డ్రోన్ల సిస్టమ్ బలోపేతం, సైన్యం కోసం ఎంకె 2 సాధనాసంపత్తి ఏర్పాటు వంటివి సైన్యానికి మరింత బలం చేకూర్చనున్నాయని అధికారులు తెలిపారు.